
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉపాధి కోసం ఎడారి దేశాల్లో బతుకుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. అయితే ఇరాన్ దేశం యూఏఈ తోపాటు ఇతర దేశాల పైన బాంబుల వర్షం కురిపిస్తుంది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న మన వారు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. ఇప్పటికే మిస్సైల్ దాడిలో పాకిస్తాన్ జాతీయుడు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది.
ఈ క్రమంలో తెలంగాణ పల్లెల నుంచి వలస వెళ్ళిన వారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. పలువురు ఫోన్ చేసి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ రెండు మూడు రోజులు బయటికి రావద్దని సూచిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా బయటకు రాకుండా ఆదేశాలు జారీ చేసింది. తాము క్షేమంగా ఉన్నామని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. తమకు ఏం ఇబ్బంది లేదని చెబుతున్నారు.
అయినప్పటికీ ఇరాన్ దాడులు మరింత ఉధృతం చేయడంతో ఏం జరుగుతుందని భయం భయంగా గడుపుతున్నారు వలస జీవులు. అదేవిధంగా బాధిత కుటుంబాలు కూడా వణికిపోతున్నాయి. ఇప్పటికే పలు విమానాశ్రయాలను క్లోజ్ చేయడంతో రావడానికి వీలు లేకుండా పోయింది. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత ప్రభుత్వం కూడా బాధితులకు భరోసా ఇస్తుంది. మరో వారం రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చర్చ సాగుతుంది. దీంతో గల్ఫ్ దేశాలు ఉంటున్న ఉమ్మడి జిల్లా వాసులు మరింత భయపడే అవకాశం ఉంది.
ఇప్పటికే పలువురు వివిధ రకాల సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నారు. తమకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దూసుకువస్తున్న మిస్సైల్స్‌తో ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ఆందోళన కనబడుతుంది. ఇప్పటికే చాలామంది బయటకు వెళ్లడం మానేశారు. అంతేకాకుండా కావలసిన నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాతనే బయటికి వస్తామని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. మొత్తానికి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గల్ఫ్ దేశాల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో మనవారు మరింత ఆందోళన గురవుతున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..