Telangana: ట్విస్టులే ట్విస్టులు.. నాయకుల అలకలు.. పార్టీ పెద్దల బుజ్జగింపులు

Telangana Elections: అలుగుతున్నారు బుజ్జగిస్తున్నారు. కొందరు మెత్తబడుతున్నారు మరికొందరు మొండికేస్తున్నారు. కొందరు పార్టీ వీడుతున్నారు. మరికొందరు అవకాశాలకోసం కాచుక్కూర్చున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ ఏ పార్టీలో చూసినా ఇదే గోల. కాకపోతే కాంగ్రెస్‌లాంటి పార్టీ రోడ్డునపడుతుంటే... మిగిలినపార్టీల్లో అంది కాస్త సైలెంట్‌గా నడిచిపోతోందంతే.

Telangana: ట్విస్టులే ట్విస్టులు.. నాయకుల అలకలు.. పార్టీ పెద్దల బుజ్జగింపులు
Telangana Elections

Updated on: Oct 13, 2023 | 7:32 PM

ఎన్నికలొచ్చాయంటే ఇవన్నీ మామూలే. కానీ ఈసారెందుకో అన్ని పార్టీల్లో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్‌లో ఈ అలకలు, బుజ్జగింపులు 70 ఎంఎంలో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో కోపతాపాలు, అలకలు, వేరుకుంపట్లు వెరీ కామన్‌. ఈసారి తెలంగాణలో అధికారంలోకొస్తామన్న నమ్మకంతో ఉన్న హస్తం పార్టీలో టికెట్ల పోటీ పెరిగింది. ఆ పోటీ చివరికి అలకలస్థాయిని దాటిపోయి.. పార్టీని షేక్‌ చేస్తోంది. అవమానాలు ఇంకానా.. ఇకపై సాగవు.. ఇకపై చెల్లవు అంటూ పార్టీతో నాలుగున్నర దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకున్నారు సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య.

టికెట్‌ వచ్చే ఛాన్స్‌ లేదనో, తన నియోజకవర్గం కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేతుల్లోకి వెళ్లిందనో పార్టీకి గుడ్‌బై చెప్పలేదు పొన్నాల. పోతూపోతూ బట్టకాల్చి కాంగ్రెస్‌ మొహాన వేశారు. కాంగ్రెస్‌ పార్టీలో కొన్నాళ్లుగా వినిపిస్తున్న బీసీ వాదాన్ని ప్రస్తావిస్తూనే టికెట్లు అమ్ముకుంటున్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. కొన్నిరోజులుగా హస్తిన స్థాయిలో కాంగ్రెస్‌లో జరుగుతున్న బీసీ ఫైట్‌ ఈ పరిణామంతో కొత్త టర్న్‌ తీసుకుంది. తమ సీట్ల కోసం గాంధీభవన్‌ వద్ద దగ్గర ధర్నాకు సిద్ధమైన బీసీ నేతలు అధినాయకత్వం ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. కానీ పొన్నాల రాజీనామాతో పార్టీలో బీసీ వర్గాలను బుజ్జగించడం, వారిని సంతృప్తి పరచడం కాంగ్రెస్‌ నాయకత్వానికి పెద్ద సవాలే కాబోతోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌ టికెట్ల ప్రకటన ఆలస్యమైపోయింది. పొన్నాల ఎపిసోడ్‌తో ఫస్ట్‌ లిస్ట్‌ విషయంలో కాంగ్రెస్‌ ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సి వచ్చేలా ఉంది. కొత్త నేతలు చేరితే పాత నేతలు పార్టీ వీడుతున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే పాత నాయకత్వం అలుగుతోంది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కాంగ్రెస్‌ కండువా కప్పుకోగాగానే మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, మెదక్‌ డీసీసీ అధ్యక్షులిద్దరూ పార్టీకి గుడ్‌బై చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వారిలో నందికంటి శ్రీధర్‌కి నామినేటెడ్‌ పోస్టు కూడా రావటంతో.. కాంగ్రెస్‌ లిస్ట్‌ వచ్చాక ఇలాంటి సీన్లు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంతుపట్టటం లేదు. ఆదిలాబాద్‌లో ఎన్నారై నేతపై పాత నేతలు రగిలిపోతున్నారు. నాగర్‌ కర్నూల్‌ లాంటి సీట్లో సీనియర్లు కుమ్ములాడుకుంటున్నారు. కమ్మవర్గానికి కనీసం 10సీట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో అధిష్ఠానం మెడపై కత్తిపెట్టారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఎంత బుజ్జిగించినా ఎంతవరకు సర్దుకుపోతారో చెప్పలేమన్నట్లే ఉంది కాంగ్రెస్‌ సీన్‌.

విపక్షపార్టీలకంటే చాలా ముందుగానే వ్యూహాత్మకంగా టికెట్లు ప్రకటించిన బీఆర్‌ఎస్‌లో కూడా కొన్నిచోట్ల అసంతృప్తులు రాజుకున్నాయి. బుజ్జగింపులతో కొందరు నేతలు సర్దుకుపోతే..మరికొందరు పార్టీ వీడారు. ఇంకొందరు మంచి ఛాన్స్‌ వస్తే చూద్దామన్నట్లున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో సీట్లు దక్కని ముగ్గురు సిట్టింగ్‌ల్లో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. బోథ్‌ ఎమ్మెల్యేని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టికెట్లు రాకపోవటంతో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలిద్దరూ మొదట అలిగినా.. రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులిచ్చి సముదాయించింది బీఆర్‌ఎస్‌ నాయకత్వం. తుమ్మల, పొంగులేటి లాంటి సీనియర్లు పార్టీ వీడిన ఖమ్మం జిల్లాలో అసంతృప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అధికారపార్టీ. వైరా టికెట్‌ మార్చటంతో అక్కడ అసంతృప్తి రాజుకున్నా.. పార్టీ పెద్దల జోక్యంతో పరిస్థితి చక్కబడింది.

సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వటంతో అధికారపార్టీలో ఆశావహులు నిరాశపడ్డా.. మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఉంటుందన్న భరోసా ఇస్తోంది బీఆర్‌ఎస్. దీంతో సీట్లు ఖాయమనుకున్న కొందరు ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు సర్దుకుపోతున్నారు. కల్వకుర్తి టికెట్‌ సిట్టింగ్‌కే ఇవ్వటంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి డైలమాలో పడ్డారు. ముందే టికెట్లు ప్రకటించేయటంతో బీఆర్‌ఎస్‌కి సామాజిక సమీకరణాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఒక్క సీటూ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉంది ముదిరాజ్‌ వర్గం. పార్టీ పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా ఎన్నికల బరిలో నిలుస్తానంటున్నారు కొందరు ముదిరాజ్‌ నేతలు. ఓపక్క పార్టీలోని అసంతృప్తులను ఎక్కడికక్కడ బుజ్జగిస్తూనే.. కొత్తగా పార్టీలో చేరేవారికి కూడా పదవుల హామీ ఇస్తోంది బీఆర్‌ఎస్. కొందరికి వెంటనే పదవులిస్తూ విపక్షపార్టీలను ఆత్మరక్షణలో పడేసే వ్యూహంతో ఉంది.

మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీలో అంతగా అసంతృప్తులు బయటపడకపోయినా లోలోపల వర్గపోరు నడుస్తోంది. ప్రధాని పర్యటనకు కూడా కొందరు ముఖ్యనేతలు దూరంగా ఉండటంతో బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన 14కమిటీల్లో అందరికీ ప్రాధాన్యం దక్కేలా జాగ్రత్తపడింది. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న నేతలకు ఈ కమిటీల్లో కీలక పదవులు దక్కాయి. విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలాంటి నేతలందరికీ పార్టీ పెద్దపీట వేసింది. ఎన్నికలముందు లేదులేదంటూనే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చిన పార్టీ.. ముఖ్య నేతలమధ్య గ్యాప్‌ని పూడ్చే ప్రయత్నాల్లో ఉంది. నాలుగ్గోడలమధ్యే మాట్లాడి సర్దుబాటు చేస్తోంది. రామగుండం లాంటి చోట సోమారపు సత్యనారాయణలాంటి సీనియర్‌ పార్టీ వీడినా.. ప్రస్తుతానికైనా ఆ పార్టీలో అలకలు, అసంతృప్తులు అంతగా బయటపడలేదు. అసలే ఎన్నికల సీజన్‌. గీత దాటారంటే వేటు పడుద్దని హెచ్చరించే పరిస్థితి దాదాపుగా ఏ పార్టీలో కూడా లేదు. బతిమాలో బుజ్జగించో ఎవరూ చేజారకుండా చూసుకుంటున్నాయ్‌ అన్ని పార్టీలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.