తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ మెరుపుదాడులు.. బయటపడ్డ సినీ పరిశ్రమ లింకులు..?

తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ (EAGLE) ఫోర్స్ మరో కీలక ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఒకేసారి ప్రత్యేక దాడులు చేపట్టిన అధికారులు డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను బలహీనపరచడంతో పాటు డిమాండ్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ మెరుపుదాడులు.. బయటపడ్డ సినీ పరిశ్రమ లింకులు..?
Eagle Force Drug Free Operation

Edited By:

Updated on: Jun 16, 2026 | 5:20 PM

తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ (EAGLE) ఫోర్స్ మరో కీలక ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఒకేసారి ప్రత్యేక దాడులు చేపట్టిన అధికారులు డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను బలహీనపరచడంతో పాటు డిమాండ్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

పట్టుబడిన వారిలో 14 మందికి గంజాయి వినియోగించినట్లు పరీక్షల్లో నిర్ధారణ కాగా, మరో వ్యక్తికి గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల వినియోగం కూడా పాజిటివ్‌గా తేలింది. విచారణలో భాగంగా అందరూ డ్రగ్స్ వినియోగించిన విషయాన్ని అంగీకరించినట్లు ఈగల్ ఫోర్స్ తెలిపింది. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించింది.

కాగా, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవాలోని వగటోర్ బీచ్ ప్రాంతంలో హాస్టల్‌ను కేంద్రంగా చేసుకుని ఓ ముఠా కొకైన్, ఎండీఎంఏ (MDMA), ఎల్ఎస్డీ (LSD), హ్యాష్ ఆయిల్ వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లు సాంకేతిక విశ్లేషణలో తేలిందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఈ మాదకద్రవ్యాలను సినీ పరిశ్రమకు చెందిన కొంతమందికి కూడా విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మొత్తం 44 మంది డ్రగ్స్ వినియోగదారులను అధికారులు గుర్తించారు. వీరిలో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ప్రధాన డ్రగ్ పెడ్లర్లు నగరంలో అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులపై దృష్టి సారించి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు ఈగల్ ఫోర్స్ పేర్కొంది. ఇందుకోసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో దాడులు నిర్వహించినట్లు తెలిపింది. విచారణలో మరో కీలక అంశం బయటపడింది. డ్రగ్స్ కొనుగోలు కోసం వినియోగదారులు చక్రపాణి, హర్షిత్ రెడ్డి పేర్లపై ఉన్న బ్యాంకు ఖాతాలకు రూ.3.13 లక్షలకు పైగా బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. చక్రపాణి, హర్షిత్ రెడ్డి ఇప్పటికే 2019లో నమోదైన ఎన్‌డీపీఎస్ (NDPS) కేసులో అరెస్టయిన నిందితులేనని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించేందుకు దర్యాప్తును మరింత విస్తరించినట్లు ఈగల్ ఫోర్స్ తెలిపింది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ఇటువంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us