
విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. 2025 దసరా సెలవులపై క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో దసరా పెద్ద పండుగ. అంతేకాదు.. ఊరూవాడ బతుకమ్మ ఉత్సవాలు కూడా చేస్తారు. అందుకే ఏకంగా 13 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు ఇవ్వనున్నారు. విద్యాశాఖ అధికారిక అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉన్నాయి. తిరిగి అక్టోబర్ 4న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి. ప్రజంట్ షెడ్యూల్ అయితే ఇదేనని.. ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే సమాచారం ఇస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఈ సెలవుల మధ్యలోనే అక్టోబర్ 2న గాంధీ జయంతి కూడా ఉంది. ఇది సాధారణంగా ప్రభుత్వ సెలవుదినం. కానీ ఈసారి దసరా సెలవుల్లో కలిసిపోయింది. షెడ్యూల్ తెలసిపోయింది కాబట్టి.. విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాక ఈ సెలవుల వేళ.. గ్రామాల్లో బొమ్మల కొలువులు, ఊరేగింపులు మొదలుకొని నగరాల్లో బతుకమ్మ ఉత్సవాల వరకు ఈ సెలవుల్లో రాష్ట్రం అంతా పండగ మూడ్‌లో మునిగిపోతుంది.
ఇక ఏపీ విషయానికి వస్తే.. దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే మొత్తం 9 రోజులు ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలల్లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు 6 రోజులు సెలవులు ప్రకటించారు. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు 8 రోజుల దసరా సెలవులు ఉంటాయి.