Hyderabad: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి కూల్చివేత నోటీసులు.. ఆయన రెస్పాన్స్ ఇదే
దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నివాసాలకు.. శేరిలింగంపల్లి తహశీల్దార్ నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోగా సమాధానం చెప్పాలని.. ఆ తర్వాత స్వచ్ఛంధంగా కూల్చివేయాలని ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసుల్లో స్పష్టం చేశారు అధికారులు. నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం కూడా ఉండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమణలకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా వదలడం లేదు. తాజాగా.. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి కూడా కూల్చివేత నోటీసులు అంటించారు. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. హైదరాబాద్ నగరంలోని దుర్గంచెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో వెలిశాయి. అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారు.
కాగా హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్‌సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు సమయంలో ఎఫ్‌టీఎల్‌లో ఉందనే సమాచారం లేదని.. ఆ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.
నగరం నడిబొడ్డున ఉన్న దుర్గంచెరువు, తీగలవంతెన హైదరాబాద్‌కి ఐకాన్‌గా మారిపోయింది. ఒకప్పుడు 100 ఎకరాల విస్తీర్ణంలో దుర్గం చెరువు ఉండేది. ప్రస్తుతం అది కాస్తా 84 ఎకరాలకు పరిమితమైంది. దాదాపు 16 ఎకరాలకు పైనే కబ్జాకు గురైంది. పదేళ్ల కిందట ఈ ఏరియాను నాన్-డెవలప్‌మెంట్ జోన్‌గా గుర్తించారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోతోంది. దుర్గం చెరువు చుట్టూ ఎన్నో విలాసవంతమైన విల్లాలు వెలిశాయి. రాజకీయ నాయకులు, ఇంజినీర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు, ఎంతోమంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూ.. ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో చాలామందికి అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఆ ఆక్రమణలను తొలగిస్తే.. కబ్జాకు గురైన దుర్గం చెరువుకు పునర్వైభవం వస్తుందని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..