Telangana: మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..

మందు కొట్టడం ఒక ఎత్తు అయితే.. పోలీసులకు దొరక్కుండా ఇంటికి చేరడం మరో ఎత్తు.. దీని కోసం గోదావరిఖని మందుబాబులు ఏకంగా ఒక వాట్సాప్ ఆర్మీనే తయారు చేశారు. పోలీసు మామల స్క్వాడ్ పేరుతో గ్రూప్ కట్టి పోలీసులకే చెక్ పెట్టాలనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. స్వయంగా ఎస్ఐ ఆ గ్రూప్‌లోకి ఎంట్రీ ఇచ్చి వీడియో కాల్ చేయడంతో అంతా నివ్వెరపోయారు..

Telangana: మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Traffic Si Joins Drunkards Whatsapp Group

Edited By:

Updated on: Apr 06, 2026 | 2:15 PM

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మందుబాబులు వేసిన ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుండి తప్పించుకోవడానికి వీరు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూప్‌నే ఆయుధంగా మార్చుకున్నారు. కానీ ఒక్క చిన్న తప్పుతో ఆ గ్రూప్ గుట్టు రట్టవ్వడమే కాకుండా స్వయంగా ఎస్ఐ ఆ గ్రూప్‌లో ఎంట్రీ ఇచ్చి చుక్కలు చూపించారు. నిత్యం పోలీసుల తనిఖీలతో విసిగిపోయిన గోదావరిఖని మందుబాబులు ఒక వినూత్న ఆలోచన చేశారు. పోలీసు మామల స్క్వాడ్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇందులో ఏకంగా వెయ్యి మందికి పైగా సభ్యులు చేరారు. పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ పోలీసులు తనిఖీలు చేపట్టినా వెంటనే ఆ లొకేషన్ వివరాలను గ్రూప్‌లో షేర్ చేసేవారు. దీంతో మిగతా మందుబాబులు ఆ రూట్‌లో వెళ్లకుండా దారి మళ్లించి సేఫ్‌గా ఇంటికి చేరుకునేవారు.

ఆటో డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు

ఈ గ్రూప్ వ్యవహారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఒక ఆటో డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ ఎస్ఐ హరిశంకర్ కంటపడ్డాడు. తనిఖీల్లో భాగంగా ఎస్ఐ ఆ ఆటో డ్రైవర్ సెల్ ఫోన్‌ను పరిశీలించగా.. అందులో ఈ పోలీసు మామల స్క్వాడ్ గ్రూప్ దర్శనమిచ్చింది. గ్రూప్ చాటింగ్ చూసిన ఎస్ఐ‌కి మందుబాబుల నెట్‌వర్క్ చూసి మైండ్ బ్లాక్ అయింది. వెంటనే ఎస్ఐ హరిశంకర్ ఒక అడుగు ముందుకు వేసి, అదే గ్రూప్‌లో తాను కూడా జాయిన్ అయ్యారు. నేరుగా గ్రూప్ సభ్యులందరికీ వీడియో కాల్ చేసి లైవ్‌లోనే భారీ క్లాస్ పీకారు. స్క్రీన్ మీద ఎస్ఐ ముఖం కనిపించగానే గ్రూప్ సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భయంతో సభ్యులందరూ ఒక్కొక్కరుగా గ్రూప్ నుండి ఎగ్జిట్ అవ్వడం మొదలుపెట్టారు. కేవలం గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే సరిపోదని ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యుల వివరాలన్నీ సేకరించామని ఎస్ఐ తెలిపారు. పై అధికారులతో మాట్లాడి సభ్యులందరికీ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. మొత్తానికి మందుబాబుల డిజిటల్ స్కెచ్ కాస్తా పోలీసుల చేతికి చిక్కి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us