
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన నందిపాటి పార్వతమ్మ తన పిల్లలను పెంచి పెద్ద చేసి, వాళ్ల పెళ్లిళ్లు కూడా చేసింది. అయితే ఇప్పుడు వారందరూ ఎవరు బ్రతుకు వారే బతుకుతున్నారు. దీంతో వృద్ధాప్యంలో ఉన్న తనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు పార్వతమ్మ ఓ శునకాన్ని తెచ్చి పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచగా.. మొన్నటి దాకా తనను ముద్దుగా చూసుకునే ‘అవ్వ’ బాక్సులో ఉండటమేంటని ఆ కుక్క తన రెండు కాళ్లను బాక్సుపై పెట్టి కళ్ల నుంచి నీరు కారుస్తూ ఉండిపోయింది.
ఈ దృశ్యాన్ని చూసిన వచ్చిన బంధువులందరూ యజమానిపై ఆ శునకం చూపే ప్రేమకు మరింత కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు శునకం కూడా నీటిలో స్నానం చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి వెళ్లినా.. శునకం మాత్రం సమాధి వద్దకెళ్లి మండుటెండలోనూ అక్కడే దీనంగా కూర్చుండిపోయింది. ఆ దృశ్యాలు అక్కడున్న వారందరినీ కంట తడి పెట్టించాయి.
తనకు రోజు అన్నం పెట్టిన యజమాని చనిపోతే.. కడుపున పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా ఈ శునకం తన విశ్వాసాన్ని చాటుకుంది. ఈ సమాజంలో కన్న తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, బిడ్డలు కనీసం ఈ శునకాన్ని చూసైనా మారుతారని ఆశిద్దాం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.