ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి.. ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ ఫైల్ పై సంతకం పెట్టనున్నారు. ఈ మేరకు సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలు రజినీకి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దివ్యాంగురాలికి ఆహ్వానం పంపించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తనకు ఆహ్వానం లభించడంపై దివ్యాంగురాలు రజినీ సంతోషం వ్యక్తంచేసింది.
వివరాల్లోకెళితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత అక్టోబర్ 17న హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డిని కలిసింది. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని.. తనకు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఈ సందర్భంగా రజినీ తన ఆవేదనను రేవంత్ రెడ్డికి చెప్పింది.. ఆమె బాధ విన్న తరువాత రేవంత్ రజనీకి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డును కూడా అందజేశారు.
ఆ హామీ ప్రకారం.. రేవంత్ రెడ్డి వికలాంగురాలు రజినీకి తొలి ఉద్యోగం ఇవ్వనున్నారు. ఈ మేరకు రేవంత్ ప్రత్యేకంగా రజినీకి ఆహ్వానం పంపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..