
హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి అభయ హస్తం పేరిట దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశముగా మలుచుకొని అప్లై చేసిన వారికి ఫోన్ చేసి ఓటీపీ షేర్ చేయాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఐదు గ్యారంటీల అమలు కోసం ఏర్పాటు అయినా క్యాబినెట్ సబ్ కమిటీ తొలిసారి భేటీ అయ్యి దీనిపై చర్చించింది. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన సబ్ కమిటీ సమావేశానికి రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఐదు గ్యారంటీల అమలు కోసం సుమారు రెండున్నర గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. ప్రజా పాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? డాటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది? ఐదు గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారిగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? వివరాలపై చర్చించారు.
ఈ సమావేశంలో సీనియర్ అధికారులు ఐదు గ్యారంటీల అమలు కోసం యాక్షన్ ప్లాన్ చేయడానికి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఐదు గ్యారెంటీలు లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. డేటాలో డూప్లికేషన్ లేకుండా సీజీజీ, ఐటీ డిపార్ట్‌మెంట్‌తో పాటు మిగతా అన్ని శాఖలు సమిష్టిగా డేటాను షేర్ చేసుకొని ఖచ్చితమైన డేటాను సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. ప్రజా పాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ, ఎంట్రీలో కానీ ఎవరు కూడా దరఖాస్తుదారుని ఓటీపీ అడగలేదనీ స్పష్టం చేశారు. ఓటీపీ అనే అంశం దరఖాస్తులోనే లేదు. ఎవరైనా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వవద్దు.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని భట్టి ప్రజలకు సూచించారు.
సైబర్ నేరస్తులు అడిగే ఓటీపీకి ప్రజాపాలనలో సేకరించిన దరఖాస్తులకు సంబంధం లేదు. ఐదు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం తగదనీ ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.