
ప్రజాభవన్‌లో నిన్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో ముగ్గురు మంత్రుల భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. లోక్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నేరుగా ప్రజాభవన్‌కు వెళ్లారు. అనంతరం కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మంత్రులు పలు అంశాలపై కీలక చర్చ నిర్వహించారు. అయితే.. సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు .. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రుల భేటీపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.. ఈ నేపథ్యంలో మంత్రులతో భేటీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. మంత్రులు భేటీ కావడం సాధారణ విషయమని.. అనవసరమైన రాద్దాంతం అవసరం లేదంటూ పేర్కొంటున్నారు.
అయితే మంత్రులు తనతో భేటీ కావడం సాధారణ విషయమని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుబాటులో లేరు కాబట్టే.. మంత్రులు తనతో పలు అంశాలపై చర్చించారని చెప్పారు. తనతో పాటు సీఎం, మంత్రులంతా సమష్టిగా పని చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు..
తమ భేటీపై కొంతమంది విషప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. మంత్రుల భేటీలో ఎలాంటి దాపరికాలు లేవని.. పాలనాపరమైన అంశాలతో పాటు మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామన్నారు. అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని.. రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని శ్రీధర్‌బాబు కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..