
ఓ వైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు, డెడ్ స్టోరేజికి చేరుకున్న ప్రధాన ప్రాజెక్టులు,చేతికి వచ్చిన పంటలన్ని కళ్ళముందు ఎండిపోతుండడం తో రైతులు తట్టుకోవడం లేదు.చివరకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పంటని కాపాడుకునే చివరి ప్రయత్నం చేస్తున్నారు అన్నదాతలు..
తెలంగాణ కు వరప్రదాయినైన ఎల్లంపల్లి జలాశయం భానుడి భగభగలకు ఆవిరవుతోంది. ఎత్తిపోతలు లేక కాళేశ్వరం జలాలు తిరిగొచ్చే దారిలేక.. దిగువ ప్రాంతాలకు తాగునీళ్లు ఇవ్వలేనంటూ చేతులెత్తేస్తోంది. మరో వైపు ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు భారీగా పడిపోతుండటంతో సాగునీటి గండాన్ని మోసుకొస్తోంది. కడెం ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఇంకో వైపు ఎండి ఎడారిగా మారుతున్న ఎల్లంపల్లి..రాబోయే తాగునీటి కటకటకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 6 జిల్లాలకు తాగు నీటి ఇబ్బందులు తప్పవంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలొ రోజురోజుకి సాగునీటి కష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు వరిపంట చేతికి వచ్చే సమయంలో నీరులేక పంటలు ఎండిపోతున్నాయి.మరో పది రోజులు అయితే పంటంతా చేతికి వచ్చేది. కానీ..ఒకేసారి భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీనితో బావులు, బోరులు ఎండిపోతున్నాయి. అదే విధంగా అయకట్టు కూడ సరిగా కెనాల్‌లో నీరు రావడం లేదు. ఈ క్రమంలో పదిహేను రోజుల నుంచి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మొగ్దుంపూర్, దుర్శేడ్ గ్రామాలైతే నీరు ఉన్న చోటు నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా వరద కాలువ సమీపంలో సాగుచేస్తున్న పంటలకు సరిగా సాగునీరు రావడంలేదని రైతులు రోడ్లేక్కుతున్నారు రైతులు. కేవలం రెండు తడులు అయితే పంటలు చేతికి వస్తాయని రైతులు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండి, మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో కనిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకుంది. ఎల్ఎండిలో కేవలం ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరో పది రోజులలో డెడ్ స్టోరేజికి చేరుకునే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుండి చుక్క నీరు వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో పంటలని ఎలా కాపాడుకోవాలని రైతులు అవేదన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోరుల్లో నీరు లేకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా పంటని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. కానీ సగం మడి కూడా పారడంలేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించే శ్రీశైలం ప్రాజెక్టు కూడా చేతులెత్తేసింది. ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో 215 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ ఇప్పుడు 34 టీఎంసీలకు చేరుకుంది. దీంతో రాబోయే రోజుల్లో సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగునీటికి కూడా కటకటలాడాల్సిందే అంటున్నారు నిపుణులు.