
మనుషులు ఇంత సెన్సిటివ్‌గా ఉంటారా..! చిన్న విషయానికే మనస్తాపంతో సూసైడ్ చేసుకుంటారా..! అమ్మానాన్న కొప్పడ్డారనో.. ప్రేమ నిరాకరణతోనో.. అనారోగ్య ఇబ్బందులతోనో.. బలవన్మరణానికి పాల్పడుతారని విన్నాం.. కానీ ఈ కేసు చాలా ఢిపరెంట్.. జస్ట్ పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఈ లోకం నుంచే దూరంగా వెళ్లిపోయింది ఓ యువతి. హైదరాబాద్ మహానగరం పరిధిలోని మీర్‌పేట్‌లో జరిగిందీ విషాదాంతం. బీఎస్సీ చదివే ఈ యువతి.. మరీ ఇంత సెన్సిటీవా?
పెంపుడు జంతువులను చాలామంది ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. కుక్కలు, పిల్లులు, పక్షులను ప్రేమగా సాకుతుంటారు. వాటిని పెంపుడు జంతువుల్లా కాకుండా సొంత మనిషిలా, కుటుంబసభ్యులుగా చూసుకుంటూ మురిసిపోతారు. ఇంకా చెప్పాలంటే మనుషుల కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. తిండికి, సౌకర్యాల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూ.. ఎక్కడికి వెళ్లినా తమ వాహనాల్లో తీసుకెళ్తుంటారు. ఆ టైమ్‌లో అవి చేసే అల్లరి చూసి ఫిదా అవుతుంటారు. బడంగ్‌పేట్ వెంకటాద్రి నివాస్‌లో ఉండే హిమబిందు కూడా ఇలాగా పిల్లిని పెంచుకుంటోంది.
గత రెండేళ్లుగా పిల్లిని ఇంట్లోవాళ్ల కంటే మిన్నగా చూసుకునేది హిమబిందు. కాలేజ్ నుంచి వచ్చాక ఫుల్ టైమ్ పిల్లితోనే స్పెండ్ చేసేది. అయితే ఈ మధ్య పిల్లి చనిపోయింది. అప్పట్నుంచి ఏదో కోల్పోయినట్టు ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు. పిల్లి చనిపోవడం తట్టుకోలేకపోయిందో.. పిల్లి లేని జీవితం వద్దనుకుందో తెలియదు.. పురుగుల మందు తాగి హిమబిందు ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే హిమబిందు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
పిల్లి కోసం యువతి సూసైడ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తలో రకంగా స్పందించారు. జంతువులన్నాక ఎదో ఒక రోజు చనిపోతాయి.. అంత మాత్రానికే ప్రాణం తీసుకోవాలా అని కొందరు ప్రశ్నించారు. మరి కొందరు మాత్రం మరీ ఇంత అటాచ్‌మెంట్ ఉంటే కష్టమన్నారు. ఈ పిల్లి చనిపోతే మరో పిల్లిని పెంచుకోవచ్చు.. కానీ ప్రాణం పోతే.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితేంటని ఇంకోంతమంది కామెంట్ చేశారు. ఎవరెన్ని రకాలుగా ఏమేం చెప్పినా పిల్లి కోసం యువతి చనిపోవడం విషాదం నింపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..