
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన పొదిళ్ల నరసమ్మకు ఇద్దరు కూతుర్లు. వీరిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేసింది. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు వెంకటమ్మ, చిన్న కూతురు కళమ్మలు , ఇద్దరికి చెరి కోటి రూపాయల మేర ఆస్తి పంచి ఇచ్చింది. ఇటీవల నరసమ్మ అనారోగ్యానికి గురి కావడంతో తన పేరిట ఉన్న డబ్బు, బంగారం చిన్న కూతురు వద్ద భద్రపరిచింది. చికిత్స పొందుతూ నరసమ్మ మృతి చెందింది. సొంత ఊరైన ఆత్మకూరుకు నరసమ్మ మృతదేహాన్ని తీసుకువచ్చారు. దీంతో తల్లి పేరిట ఉన్న డబ్బు, బంగారంతో అంత్యక్రియలు చేయాలని పెద్ద కూతురు వెంకటమ్మ అడగడంతో తలెత్తిన విభేదాలు ఈ అమానుషానికి దారితీశాయి.
ఇప్పటికే సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తిని కూతుళ్లకు పంచినప్పటికీ.. ఆశ చావని ఆ కూతుళ్లు తల్లి అంత్యక్రియల సమయంలోనూ పంపకాలను తేల్చాలని పట్టుబట్టారు. దీంతో మూడు రోజులుగా నరసమ్మ మృతదేహం ఇంటి ముందే ఉండిపోయింది. ఈ ఆస్తి గొడవలతో కన్నతల్లి అంత్యక్రియలు నిలిచిపోయాయి. తల్లి డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని తన చెల్లెలు కళమ్మ అంత్యక్రియల కోసం రావడంలేదని అక్క వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తల్లి బతికి ఉండగానే ఆస్తులు తీసుకున్న కూతుళ్లు.. ఆమె చనిపోయాక మాత్రం ‘తలకొరివి’ పెట్టడానికి కూడా కనికరం లేకుండా వ్యవహరించడం స్థానికులను కలచివేసింది. ఆస్తుల కోసం తల్లి ప్రేమను, మమకారాన్ని, కనీస మానవత్వాన్ని సైతం మరిచిన ఆ కూతుళ్ళ నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
తనకు ఆస్తులపై మమకారం లేదని తల్లి పేరిట ఉన్న ఆస్తి , డబ్బు పెద్దమనుషుల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి వినియోగించాలని పెద్ద కూతురు వెంకటమ్మ కోరుతుంది. కొంత సమయం వేచి చూసి చెల్లెలు వచ్చినా రాకున్నా అంత్యక్రియలు పూర్తి చేస్తానని చెబుతోంది. కనీసం పెద్దల జోక్యంతోనైనా ఈ వివాదం సద్దుమణిగి, మరణించిన ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరే విధంగా అంత్యక్రియలు పూర్తవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.