Telangana: తన కన్నతండ్రి చనిపోవడంతో కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేకపోవడంతో భిక్షాటన చేసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది ఓ కూతురు. ఈ హృదయ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఒంటెద్దు దుర్గయ్య అనే వ్యక్తి ఆదివారం గ్రామంలోని వివేకానంద విగ్రహం వద్ద నాగుపాము కనిపించడంతో దుర్గయ్యకు గ్రామస్తులు సమాచారం చేరవేయడంతో దుర్గయ్య పామును పట్టుకొని సంచిలో వేసే క్రమంలో అతనిపై పాము కాటు వేసింది. అపస్మారక స్థితిలో వెళ్లడంతో వెంటనే గ్రామస్తులు అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో అప్పటికే దుర్గయ్య మృతి చెందినట్లు వైద్య అధికారులు తెలిపారు. దుర్గయ్య కూలి పనులు చేసుకుంటూ ఎక్కడైనా పాములు కనబడితే పాములను పట్టే వృత్తి నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో దుర్గయ్య అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేకపోవడంతో కన్న కూతురు బుజ్జి, కొడుకు కాశీరాం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ బిక్షాటన చేసి డబ్బులు పోగు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక ఘటన అందరికీ కలచివేస్తుంది.