
ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు.. సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఏకంగా నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి దిగారు.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. భార్యాభర్తలే కలిసి నకిలీ నోట్ల తయారీ ముఠాగా మారారు. ఇంట్లోనే ప్రింటర్, ప్రత్యేక పేపర్లతో రూ.500 నోట్లను తయారు చేసి మార్కెట్‌లో చలామణి చేశారు. నకిలీ కరెన్సీ నోట్లతో అమాయక వ్యాపారులను బురిడీ కొట్టించారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విజయవాడ రాజీవ్, పావని దంపతులు.. మిర్యాలగూడ, నల్లగొండలలో చిరు వ్యాపారాలు చేశారు. అయినా ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ప్రస్తుతం నల్లగొండలో మిర్యాలగూడ రోడ్డులో కంచర్ల టవర్స్ లో నివాస ముంటున్నారు. ఈజీ మనీ కోసం సోషల్ మీడియాలో యూట్యూబ్ ను చూశారు. నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేయాలని భావించారు. నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి అవసరమైన ప్రింటర్, పేపర్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు. ఇలా నకిలీ 500 కరెన్సీ నోట్లను తయారు చేశారు. రద్దీగా ఉన్న షాపులు,సంతలు, కౌంటర్ వద్ద వృద్ధులు ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చలామణి చేస్తున్నారు.
చండూరు మండలం తాస్కానీ గూడెంలో మిల్క్ సెంటర్ లో రాజీవ్ పాల ప్యాకెట్ కొని షాపు యజమాని ఆవుల కిరణ్ కు నకిలీ కరెన్సీ నోటు ఇచ్చాడు. ఆ నోటును చూసిన షాప్ యజమానికి అనుమానం వచ్చి చండూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నల్గొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని నకిలీ కరెన్సీ చలామణి ముఠాపై దృష్టి సారించారు. పక్కా సమాచారంతో నల్లగొండలోని కంచర్ల టవర్స్ లో ఉంటున్న రాజు పావని దంపతుల ఇంటిపై పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
Nalgonda Fake Currency Case
కిలాడీ దంపతులను విచారించగా ఆర్థిక ఇబ్బందులతో నట్లీ కరెన్సీ నోట్లను తయారు చేసి చలామణి చేస్తున్నట్లు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. వీరి నుండి నకిలీ కరెన్సీ, ప్రింటర్, స్కానర్, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి తెలిపారు. రాజు పై మిర్యాలగూడలో రౌడీ షీటర్ నమోదు అయిందని, తెలుగు రాష్ట్రాల్లో మహబూబాబాద్, తొర్రూర్, కరీంనగర్ గోదావరిఖని, జనగాం, అద్దంకి, వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ లతో కలిపి మొత్తం 07 నకిలీ నోట్ల చలామణి కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..