Marri Shashidhar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు మరింత పెరుగుతున్నాయి. ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది నేతలు బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదు. తానెప్పుడూ కాంగ్రెస్ వాదిగానే ఉంటానని లేఖలో స్పష్టం చేశారు. టీపీసీసీ నూతన కార్యవర్గానికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అయితే, లేఖలో సహకరిస్తానని చెప్పిన ఆయన.. ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌గా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి నియామకానికి వ్యతిరేకిస్తూనే ఆయన రాజీనామా చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
కాగా, రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి కూడా తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరిచారు. ఇకపై గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. టీపీసీసీ కాస్తా టీడీపీ పీసీసీగా మారిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also read: