Rahul Gandhi Tour: తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన దాదాపు ఖరరావడంతో క్యాడర్‌లో జోష్ పెరిగింది. ఇప్పటికే రాహుల్ సభకు సంబంధించిన అనుమతులతో పాటు ఏర్పాట్లను నేతలు దగ్గరుండి చూస్తున్నారు. రాహుల్ తెలంగాణ పర్యటనలో ఎం దిశానిర్దేశం చేయబోతున్నారు..? పార్టీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది…? ఇదే ఇప్పటి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠగా మారింది. రాహుల్ పర్యటనకు ముందు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్.. రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు.
తెలంగాణలో గతకొంత కాలంగా మసకబారిని పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యనేతలందరితోనూ రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్గత కలహాలు మాని వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని దిశానిర్ధేశం చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఒకవైపు ప్రజా సమస్యలపై కార్యచరణ తో వేగంగా వెళ్తున్న రాష్ట్ర నేతలు..రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత ఉమ్మడిగా పోరాడుతున్నారు. మొదటిసారి అందరూ కలిసి గవర్నర్‌ను కలిసి పిర్యాదు చేశారు.
ఇదంతా ఒక ఎత్తైతే ఇక రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర నేతల్లో టెన్షన్ మొదలైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం మొదలు పెట్టింది. మే మొదటివారం రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మే 4 వ తేదీన పీసీసీ ఏర్పాటు చేస్తున్న వరంగల్ భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. మే 5 వ తేదీన హైదరాబాద్ బోయినపల్లిలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. చాలా రోజుల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన జరుగుతుండటంతో రాష్ట్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
వరంగల్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరంగల్‌లో మొదట సభను ప్రారంభించారు రాహుల్. ఆ తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో ఒక కొత్త సెంటిమెంట్‌కు పార్టీ నేతలు తెరలేపారు. బోయినపల్లి కార్యకర్తల సమావేశం జరిగే ప్రదేశాన్ని కాంగ్రెస్ పార్టీ వైస్సార్ హయాంలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అదే ప్రాంతంలో మే 5 న పార్టీ శిక్షణ తరగతులు ప్రారంభించి అక్కడే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు అనంతరం ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. వరంగల్ సభ, బోయినపల్లి కార్యకర్తల సమావేశంలో పార్టీ పటిష్టత, ప్రజా సమస్యలపై కార్యచరణ, ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నిర్ణయించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు చారిత్రక అవసరమనే అంశాలతో పాటు, వచ్చే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై నాయకులకు కార్యకర్తలకు అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ నేతల్లో ఇప్పటికే హడావిడి మొదలయింది. ఎప్పుడు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే నేతలు కలిసి కట్టుగా ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై మొన్న గవర్నర్ ని కలసిన నేతల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో స్టార్ కంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లాంటి నేతలు పాల్గొని మేమంతా కలిసే ఉన్నామని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.
రాహుల్ గాంధీ పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాల అమలు కోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ రేపటి నుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. శుక్రవారం పీసీసి కార్యవర్గ సభ్యులతో పాటు పార్టీకి చెందిన వివిధ అనుబంధ చైర్మన్లతో సమావేశం కానున్నారు. శనివారం ఇందిరా భవన్ లో ముఖ్యనేతల తో ఠాగూర్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులతో ఠాగూర్ సమావేశం అవుతారు. రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయడంతో పాటు.. జన సమీకరణ పార్టీ పటిష్టత ,కార్యాచరణ విజయవంతం చేయడానికి పలు అంశాల పై ఠాగూర్ దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్ చేయడం వరుస సమవేశాలు, రాహుల్ సభ తో కాంగ్రెస్ గాడిలో పడేనా లేదా అనేది వేచిచూడాల్సిందే..