Telangana: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు. ఉద్వేగానికి లోనై తాను అలా అన్నానని, తన పొరపాటును మన్నించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన మాటల వల్ల తప్పు దొర్లిందని వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో చండూరులో కాంగ్రెస్ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రసంగించిన అద్దంకి దయార్ రెచ్చిపోయారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై స్పందించిన ఆయన.. పరుష వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి పార్టీలో ఉంటే ఉండండి లేదంటూ వెళ్లిపోండి అన్నట్లుగా పరుష కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కల్లోలం సృష్టించింది. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు అద్దంకి దయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీపీసీసీ నుంచి అద్దంకి షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించిన అద్దంకి దయాకర్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. పార్టీకి నష్టం చేయొద్దని ఉద్దేశంతోనే, బాధలో తాను అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. పార్టీకి నష్టం వాటిల్లే ఏ పనిని కూడా తాను చేయబోనని స్పష్టం చేశారు అద్దంకి దయాకర్. మరోసారి ఇలాంటివి పునరావృతం అవకుండా చూసుకుంటానని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..