Revanth Reddy: సర్కార్ టార్గెట్ అదే.. తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలిసారిగా సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు.

Revanth Reddy: సర్కార్ టార్గెట్ అదే.. తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి..
Revanth Reddy

Updated on: Dec 24, 2023 | 11:03 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలిసారిగా సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన కార్యక్రమాలపై లోతుగా చర్చిస్తారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించనున్నారు రేవంత్‌. ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం.

నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకై ప్రభుత్వ పనితీరును మరింత మెరుగు పర్చడం, జవాబుదారిగా ఉండేందుకే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు సీఎం రేవంత్‌. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని.. అక్కడికక్కడ పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. ఈ నెల 28 నుంచి 2024 జనవరి 6 వరకు ఈ ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులల్లో రోజుకు రెండు గంటల చొప్పున అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి.

ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్‌లను ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా షెడ్యూలు ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..