
కిషన్ రెడ్డి, కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన పెద్ద అడ్డంకిగా మారారని చిట్ చాట్‌లో సీఎం రేవంత్ ఆరోపించారు. ప్రాజెక్టుల పురోగతి గురించి తాను కిషన్ రెడ్డిని పదిసార్లు అడిగానని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ఒక్క లేఖ అయినా రాశారా అని ప్రశ్నించారు. BRS, BJP మధ్య ఉన్న లోపాయికారీ బంధం ఉందని కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి చేస్తున్నారని సీఎం అన్నారు.
తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం అస్సలు పనిచేయడం లేదని విమర్శించారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు మంచి పేరు వస్తుందోనే కుళ్లుతో అక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టును బీజేపీ నేతలే అడ్డుకున్నారని అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆయనకు నచ్చినట్టు ఆయన ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పారు. గతంలో కేవలం శాంతిభద్రతల సమస్య వస్తుందనే కారణంతోనే కొన్ని అనుమతులు నిరాకరించాల్సి వచ్చిందని వివరించారు. పవన్ అడిగిన ప్రశ్నలకు తమ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే తగిన సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే సమయంలో ఏపీలో జగన్ సభలకు పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వడం లేదనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసులు లేకపోయినా, లేని కేసును సృష్టించి మధ్యప్రదేశ్‌లో రిటర్నింగ్ అధికారి తప్పుగా ఆమె నామినేషన్‌ను తిరస్కరించారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట ఓట్ల చోరీకి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు సీట్ల చోరీకి తెరలేపిందని, మధ్యప్రదేశ్‌లో మూడవ అభ్యర్థిని రంగంలోకి దించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఎంపీల విలీనం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని, కేవలం పార్టీల విలీనం గురించి మాత్రమే రాజ్యాంగంలో ప్రస్తావన ఉందని చట్టపరమైన అంశాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతలు ఎవరూ అధికారికంగా కాంగ్రెస్‌లో చేరలేదని కూడా రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.