
హైదరాబాద్‌ను అత్యాధునిక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పి. కృష్ణారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై భవిష్యత్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిష్కారాలపై చర్చించారు.
నగరంలో అనలాగ్, ఎంఈఐఎల్ సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని సంస్థల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలపై తమ ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కూడా సమావేశంలో ప్రదర్శించారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా సేవలు, పట్టణ పాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించవచ్చో వివరించారు.
సెన్సర్లు, రోబోటిక్స్, ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంతో ట్రాఫిక్ రద్దీని ముందుగానే గుర్తించడం, సిగ్నళ్లను ఆటోమేటిక్‌గా నియంత్రించడం, నీటి లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టడం, విద్యుత్ వినియోగాన్ని అవసరానికి అనుగుణంగా నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు వేగంగా మార్గం కల్పించడం వంటి కాగ్నిటివ్ సిటీ పరిష్కారాలను సంస్థలు వివరించాయి.
వేగంగా విస్తరిస్తున్న నగరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళిక, ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని పెంచడం, పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని సంస్థలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను ఒకే వ్యవస్థలో అనుసంధానం చేయాలని, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నళ్లు స్వయంచాలకంగా పనిచేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే వాతావరణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ నిర్వహణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో అనలాగ్, ఎంఈఐఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడం, ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుందని ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.