సిరిసిల్ల, అక్టోబర్17: రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రత్యర్ధులకు అందని స్పీడ్‌లో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు( సీఎం కేసీఆర్). ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్.. కరెంట్.. ధరణి.. ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనను 60ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరెవరో వచ్చి ఏవేవో చెప్తుంటారు. అంతమాత్రాన ఆగం కావొద్దంటున్నారు సీఎం కేసీఆర్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సిద్ధిపేట, సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. సిరిసిల్లలో సీఎం పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి సిరిసిల్ల పట్టణంలోని సభాస్థలి దగ్గర ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు సిద్ధిపేటకు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. సిద్ధిపేటకు రైలు వచ్చిన తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకి భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి 20వేల మంది యువకులు బైక్‌లపై సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు మంత్రి హరీష్‌రావు. దాదాపు లక్ష మంది జనసమీకరణతో సభను విజయవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
సోమవారం భువనగిరి, జనగామలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఓట్ల కోసం ఇతర పార్టీల్లా తాము అబద్ధాల మేనిఫెస్టో పెట్టలేదన్నారు. దేశంలో దళితబంధు పెట్టాలనే ఆలోచన ఏ సీఎంకు అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే.. 93 లక్షల మందికి కేసీఆర్ బీమా అమలు చేస్తామన్నారు. ధరణిని తీసేస్తామని.. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలన్నారు.
తెలంగాణ రాకపోతే భువనగిరి జిల్లా అయి ఉండేది కాదన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించిందని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించుకుని 24 గంటల కరెంటును కొనసాగించుకుందామని పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్‌లో తొలిరోజు 69 మందికి బీఫాంలు ఇచ్చిన సీఎం కేసీఆర్.. రెండో రోజు ప్రగతి భవన్‌లో మరో 28 మందికి బీఫార్మ్‌లు ఇచ్చారు. మిగిలిన వాళ్లకు ఇవాళ, రేపటిలోగా బీఫాంలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బీఫార్మ్‌లు నింపేప్పుడు జాగ్రత్త వహించాలని.. అవసరమైతే పార్టీ లీగల్ సెల్ సలహాలు తీసుకోవాలని నేతలకు మరోసారి సూచించారు కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి