ఫలక్‌నుమా ప్రమాదంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. అగ్ని ప్రమాద కారణాలపై ఇంకా వీడని చిక్కుముడులు. ఏడు బోగీలు దగ్ధమయ్యేంత మంటలు ఎలా వచ్చాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిగరెట్ కాల్చడం వల్ల ప్రమాదం జరిగిందని కొందరు ప్రయాణికుల వాదన. మరికొందరు మాత్రం విద్రోహ చర్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రమాదంపై నల్గొండ జీఆర్పీ దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే ఫలక్‌నుమా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. క్లూస్ టీమ్ దగ్ధమైన బోగీలను పరిశీలించింది. ప్రమాదానికి సంబంధించి ఆధారాలు సేకరించింది. ఎస్-4 కోచ్ బాత్‌రూమ్‌లో ముందుగా మంటలు చెలరేగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. బోగీలోని కరెంట్ వైర్లలో లోపాల వల్లే ప్రమాదం సంబంధించినట్లుగా గుర్తించారు. ఎస్-4 బోగీలో చెలరేగిన మంటలు ఇతర బోగీలకు వ్యాపించాయని నిర్ధారణ అయింది. అధికారులు ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదం వెనక కారణాలపై స్పష్టత ఇస్తామని క్లూస్ టీమ్ చెబుతోంది. 12 మంది అధికారులతో కూడిన టీమ్ మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది.
శుక్రవారం ఉదయం యాదాద్రి-భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన కొందరు ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. ప్రయాణికులంతా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజు అనే యువకుడు సమయస్ఫూర్తితో చైన్ లాగి పలువురి ప్రాణాలు కాపాడాడు. అయితే ఫలక్‌నుమా ప్రమాదంపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీమ్ చెబుతున్నట్లు ఇది షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదమా? ప్రయాణికుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి అగ్ని ప్రమాదానికి కారణమయ్యారా? లేక దీనిలో కుట్ర కోణం ఉందా? అసలు రైలు నిర్వహణ సరిగా ఉందా లేదా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..