Bhatti Vikramarka: ఆదిలాబాద్‌ టు ఖమ్మం.. 91 రోజులపాటు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్ర..

|

Mar 12, 2023 | 8:47 AM

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 16 నుంచి 91 రోజుల పాటు భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకూ పాదయాత్ర కొనసాగించేందుకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Bhatti Vikramarka: ఆదిలాబాద్‌ టు ఖమ్మం.. 91 రోజులపాటు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్ర..
Bhatti Vikramarka
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రల బాట పట్టారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నేత భట్టివిక్రమార్క కూడా పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు AICC కార్యదర్శి రోహిత్‌ చౌదరి ప్రకటించారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో సాయంత్రం 4 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు. పార్టీ తెలంగాణ ఇంఛార్జ్‌ ఠాక్రే ఆదేశాలతో తెలంగాణలో కాంగ్రెస్‌ నేతు హత్‌ సే హత్‌ జోడో అభియాన్‌ యాత్ర కొనసాగిస్తున్నారని వెల్లడించారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొత్తం 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్ర రూట్‌మ్యాప్‌ రెడీ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ బీఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ధైర్యం ఇచ్చి వారికి మేము అండగా ఉన్నామని చెప్పడానికే తాను పాదయాత్ర చేస్తున్నట్లు భట్టి తెలిపారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా చేస్తున్న పాదయాత్ర ద్వారా ప్రతి గడపగడపకు తీసుకువెళ్తామన్నారు భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేస్తున్న పాదయాత్రలో అన్ని జిల్లాల అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ సభ్యులు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాములు చేసే పర్యవేక్షణ AICC నిర్వహిస్తుందన్నారు. మంచిర్యాల, హైదరాబాద్ శివారు, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఉంటాయన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజల శక్తి మేరకు తనతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి బలోపేతం చేయాలన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అవసరాలు ఆశయాలని కాంగ్రెస్ అజెండాగా మార్చుకొని జరిగే పాదయాత్రలో భాగస్వాములై విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు కోరారు భట్టి విక్రమార్క.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..