CM Chandrababu : ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం- సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌ను మించేలా అమరావతిని నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సౌత్‌ ఏసియా లెర్నింగ్‌ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయ కారణాల వల్ల ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాయన్నారు.

CM Chandrababu : ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం- సీఎం చంద్రబాబు
Chandrababu Naidu Amaravati Vision

Updated on: Mar 22, 2026 | 6:04 PM

1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చారని.. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆర్ధిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నామన్నారు. నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నామని, ఐటీకి సూచికగా సైబర్ టవర్స్ నిర్మాణం చేశామన్నారు. ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందుకే బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను వదిలిపెట్టి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో అడుగు పెట్టిందన్నారు. మూడు దశాబ్దాలుగా ఆ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నామని.. దీనిలో భాగంగానే ఐ.ఎస్.బీని కూడా హైదరాబాద్‌కు తెచ్చాం అన్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ ఫార్మారంగంలోనూ నెంబర్ వన్ గా ఉన్నాయని..కరోనా సమయంలో హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ ప్రపంచానికే వ్యాక్సీన్ అందించిందన్నారు.

రాజకీయ కారణాల వల్ల ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాయన్నారు. 2024 లో మళ్లీ ఏపీలో మేం అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ అంతా సర్వనాశనం అయ్యింని, బ్రాండ్ పోయింది, వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయన్నారు. కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కొన్ని ప్రోగ్రెసివ్ నిర్ణయాలు తీసుకున్నామని.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాల లాంటి కీలకమైన నిర్ణయాలతో వేగంగా ముందుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతం పెట్టుబడుల్ని ఆకర్షించటంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.

ఇప్పుడు ఇక క్వాంటం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ లాంటివే భవిష్యత్ టెక్నాలజీలని.. అందుకే రాష్ట్రంలో స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలను నిర్మిస్తున్నామన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా లాంటివి విద్యుత్ రంగాన్ని శాసిస్తాయని.. సుస్థిర విద్యుత్ ఉత్పాదనతో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచాల్సిన అవసరం రాబోదన్నారు. ఇంధనాలు, విద్యుత్ లాంటి వాటి వ్యయం ఎంత తక్కువకు ఇస్తాం అన్నదే ఇప్పుడు అతిపెద్ద సవాలు అన్నారు.

ప్రస్తుతం యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా పడిందని.. ఎల్పీజీ కొరత నేపథ్యంలో పీఎన్జీ కీలకంగా మారిందన్నారు. దక్షిణ భారత్ లోనే గ్రీన్ ఇంధన తయారీలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని.. తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శనాల ఎఫీషియన్సీని 15-20 శాతం పెంచగలిగామన్నారు. ఆధునిక ల్యాబ్ ద్వారా ప్రసాదం తయారీలో వినియోగించే పదార్ధాలను కూడా నిత్యం పరీక్షిస్తున్నామన్నారు. గతంలో లా ఇప్పుడు కల్తీ నెయ్యి వాడేందుకు ఆస్కారం ఉండబోదన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం తెలుసుకునేలా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపోందిస్తున్నామని.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ సేవలు కూడా అందబోతున్నాయని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us