Paddy Procurement: తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం.. రబీ ధాన్యం కొనుగోలుకు గడువు పొడిగింపు

|

May 05, 2022 | 8:29 AM

రైస్‌మిల్లులో అవకతవకలు జరుగుతున్నాయని FCI దాడులు చేస్తుంటే...కొనుగోలు నిలిపివేయాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు మంత్రి గంగుల కమలాకర్‌రెడ్డి.

Paddy Procurement: తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం.. రబీ ధాన్యం కొనుగోలుకు గడువు పొడిగింపు
Paddy Purchase
Follow us on

Paddy Procurement: కేంద్రం వర్సెస్‌ రాష్ట్రం. ధాన్యం కొనుగోలు అంశంలో ఎవరి రాజకీయం వారిది. ఎవరి ఎత్తులు వారివి. వరివార్‌ కంటిన్యూ అవుతోంది. రైస్‌మిల్లులో అవకతవకలు జరుగుతున్నాయని FCI దాడులు చేస్తుంటే…కొనుగోలు నిలిపివేయాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు మంత్రి గంగుల కమలాకర్‌రెడ్డి.

తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది కేంద్రం. రబీ సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు, మరోసారి గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆరుసార్లు గడువు పొడిగించినప్పటికీ, మరోసారి సమయం పెంచుతున్నట్లు వెల్లడించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు కేంద్రమంత్రి పియూష్ గోయెల్. గడువు పొడిగించినందుకు పియూష్‌ గోయల్‌కు, కృతజ్ఞతలు చెప్పారు కిషన్‌రెడ్డి.

గడువు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 18న కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన కేంద్రం, తాజాగా గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. అప్పట్లోగా మిల్లింగ్ పూర్తి చేసి సెంట్రల్ పూల్‌కి బియ్యాన్ని అందజేయాలని స్పష్టం చేసింది. మరోసారి గడువు పొడిగించడం కుదరదని తేల్చి చెప్పింది. గడువులోగా అందివ్వలేకపోతే మిగిలిన బియ్యానికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. రీసైక్లింగ్ బియ్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐ సూచించింది. మిల్లుల వారీగా సెంట్రల్ పూల్‌కి అందించాల్సిన బియ్యంపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలివ్వాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం లేదని, అవకతవకలు జరిగాయని గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో తెలంగాణలో రెండుమూడు రోజులుగా ఎఫ్‌సీఐ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేశారు. అయితే, తనిఖీల సమయంలో కొందరు మిల్లులకు తాళాలు వేయడం చర్చనీయాంశమైంది.

అయితే, తెలంగాణలో FCI దాడుల విషయంలో కేంద్రానికి గట్టి కౌంటరిచ్చారు సివిల్‌ సప్లయ్‌ మినిస్టర్‌ గంగుల కమలాకర్‌. ధాన్యం కొనుగోలులో జాప్యం చేసేందుకే FCI దాడులు చేస్తోందని ఆరోపించారు. కోనుగోలు నిలిచిపోవాలనే ఉద్దేశ్యంతో కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రైస్‌ మిల్లులు తప్పులు చేస్తే మేం చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రానికి ఏం సంబంధముందని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్‌.