ఎన్నికలు అనగానే ఓట్ల కోసం వచ్చే నేతల వద్ద తమ డిమాండ్లను పెట్టి సాధించుకుంటారు. కొన్ని సందర్భాల్లో సమస్యలపై నిరసనను కూడా వ్యక్తం చేస్తుంటారు. తమ డిమాండ్లు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు కొందరు ఎన్నికలను వేదికగా చేసుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్ పెంపుకు కారణమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
ఉమ్మడి నల్గొండ జిల్లాను నాలుగు దశాబ్దాలుగా ఫ్లోరైడ్ భూతం పట్టిపిడించింది. ఫ్లోరైడ్ మహమ్మారి బారి నుంచి జిల్లాను కాపాడాలంటూ జల సాధన సమితి ఎన్నో ఆందోళనలు చేపట్టింది. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసి, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికలను వేదికగా చేసుకుంది జల సాధన సమితి.
1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో..
1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జల సాధన సమితి వందలాది మంది ఫ్లోరైడ్ బాధితులు, రైతులు, ఉద్యమ కార్యకర్తలతో నల్గొండ లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయించింది. ఈ ఎన్నికల్లో 537 నామినేషన్లు దాఖలు కాగా, స్క్రూట్ని తర్వాత 480 మంది బరిలో మిగిలారు. ఇందులో ఆరుగురు మాత్రమే రాజకీయ పార్టీల అభ్యర్థులు కాగా, 386 మంది షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభ్యర్థులున్నారు. చాలా మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సమయం సరిపోకపోవడంతో పోలింగ్‌ను నెల రోజులపాటు ఎన్నికల సంఘం వాయిదా వేసింది. 480 గుర్తులతో బుక్ లెట్ సైజులోబ్యాలెట్ పత్రం రూపొందించారు.
ఇందుకు అనుగుణంగా బ్యాలెట్ బాక్స్ లు ప్రత్యేకంగా భారీ ఆకారంలో తయారు చేయించారు. 1996 మే 27న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఓట్లను లెక్కించేందుకు రెండు రోజుల సమయం పట్టింది. 477 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. నల్గొండ లోక్‌సభకు నిర్వహించిన ఈ ఎన్నిక జాతీయ స్థాయిలో చర్చకు, ఎన్నికల సంస్కరణలకు దారి తీసింది.
నామినేషన్‌కు డిపాజిట్ పెంపు..
సాధారణంగా లోక్‌సభకు పోటీ చేయడానికి డిపాజిట్‌గా సాధారణ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250, శాసనసభ సభ్యుడిగా పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.125 చెల్లించాల్సి ఉండేది. 1996లో నల్గొండ లోక్‌సభ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల కమిషన్ సంస్కరణలు తెచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నామినేషన్ ఫీజును లోక్‌సభకు జనరల్ అభ్యర్థులకు రూ.500 నుంచి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.12,500, శాసనసభకు జనరల్ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.10వేలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.125 నుంచి రూ.5000కు పెంచింది. అప్పటి నుంచి పెంచిన డిపాజిట్‌ను అభ్యర్థులు చెల్లిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…