
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎత్తులు, పై ఎత్తులతో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఒకపార్టీ.. మరోపార్టీకి బీ టీమ్ అంటూ పొలిటికల్ హీటెక్కిస్తున్నాయి. అంతర్గతంగా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన కాంగ్రెస్..చేరికలపై ఫోకస్ పెంచి మరీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో సమావేశం అయిన నేతలు ఇతర నాయకులను కలిసే పనిలో పడ్డారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. తెలంగాణ ఒక్కటే కాదు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ కనుమరుగు అవుతుందన్నారు రాహుల్.
కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. రాష్ట్రానికి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించడానికి వెళ్లిన కేటీఆర్..కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వచ్చిన ఉద్దేశ్యమేంటో ప్రజలందరికీ తెలుసన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే. గత నాలుగేళ్లుగా లేని సమస్యలు ఇప్పుడే వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు తెలంగాణపై ఫోకస్ పెట్టారు ఢిల్లీ బీజేపీ పెద్దలు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనే సమాచారంతో బీజేపీ అధిష్ఠానం వారిద్దరిని ఢిల్లీకి పిలిచింది. వారిద్దరితో మాట్లాడి, పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని విధంగా కేడర్ అంతా సమన్వయంతో పనిచేయాలని అధిష్ఠానం ఆదేశించనున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం