టీవీ9 కాంక్లేవ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ ఏడాది కాలంలో బీఆర్ఎస్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డామన్నారు. అధికారం పోయింది కానీ ప్రజల్లో అభిమానం పోలేదన్నారు. ఓటమి మాకు మంచే చేసిందని, ఎవరు మావారో మాకు తెలిసిందని పేర్కొన్నారు. కేసీఆర్ పేరు తీసుకోకుండా రేవంత్‌కు పూటగడవదని విమర్శించారు. కేసీఆర్ తమకు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని..
కేసీఆర్ మౌనంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ మొదటి రోజు నుంచే దాడి మొదలుపెట్టిందని మండిపడ్డారు. పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీలని చెప్పి అర గ్యారంటీ అమలు చేశారని సెటైర్ వేశారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలనంతా ..కేసీఆర్‌పై తిట్లు..దేవుళ్లపై ఒట్లు..హామీలకు తూట్లు అని దుయ్యబట్టారు. మేం అప్పు తెచ్చి గొప్ప ప్రాజెక్టులు కట్టామని, కాంగ్రెస్ రూ.లక్ష కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిందని ప్రశ్నించారు. సచివాలయంలో కాంగ్రెస్ మాత విగ్రహం పెడుతున్నారని, తెలంగాణ తల్లిని మార్చడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయమన్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చారు..భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రాన్నే మాయం చేస్తారని విమర్శించారు. ప్రజల్లో వ్యతిరేకత లేదని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్‌లో చేరిన తమ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ సవాల్ విసిరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి