Telangana: తమ్ముడి మరణం తట్టుకోలేక గంటల వ్యవధిలో అన్న మృతి.. పుట్టుకలోనే కాదు మరణంలోనూ తోడుగా..

|

Jan 09, 2023 | 2:52 PM

వారిద్దరూ అన్నదమ్ములు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేరు. అది పుట్టుకైనా సరే చావైనా సరే. తమ్ముడి మరణం జీర్ణించుకోలేక పోయిన ఆ అన్న.. కూడా.. తమ్మడి తోటిదే జీవితంగా అనంత లోకాలకు వెళ్లిపోయిన విషాద ఘటన జగిత్యాల్ జిల్లా మెట్ పల్లిలో చోటు చేసుకుంది.

Telangana: తమ్ముడి మరణం తట్టుకోలేక గంటల వ్యవధిలో అన్న మృతి.. పుట్టుకలోనే కాదు మరణంలోనూ తోడుగా..
Tragedy In A Family
Follow us on

అన్నాదమ్ముల అనుబంధానికి ఆ ఇద్దరు సోదరులు ఎంత ప్రతీకలంటే.. తమ్ముడూ నువ్వు లేక నేను క్షణమైనా ఈ భూమి మీద ఉండలేను అని చెప్పడం మాత్రమే కాదు.. చేసి చూపించాడా అన్న. తమ్ముడి కోసం ప్రాణాలైనా వదిలేస్తానన్న మాటకు నిదర్శనంగా నిలిచాడు. తమ్ముడు గుండెపోటు వచ్చి చనిపోతే.. ఆ దుర్వార్త తట్టుకోలేక పోయాడు. క్షణ క్షణం కుమిలి పోయాడు. స్మశానంలో అంత్యక్రియలు జరిగే వరకూ బిగబట్టిన ఆ ప్రాణం.. అమాంతం కుప్పకూలిపోయింది.

జగిత్యాల్ జిల్లా మెట్ పల్లిలోని  రెడ్డికాలనీకి చెందిన అన్నదమ్ములు సచిన్, శ్రీనివాస్. తండ్రి నాగభూషణం టెంట్ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. పెద్ద కొడుకు సచిన్ ఒక బ్యాంకులో పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం.. గుండెపోటు రావడంతో తమ్ముడు శ్రీనివాస్ చనిపోయాడు. అప్పటి వరకూ ఎంతో ఉల్లాసంగా కనిపించిన తమ్ముడు ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేక పోయాడా అన్న. తమ్ముడితో ఇంతకాలం తాను గడిపిన జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తుకు వస్తుంటే ఏం చేయాలో పాలు పోవడం లేదు. తమ్ముడి తో గడిపిన క్షణాలు పదే పదే ఉక్కిరి బిక్కిరి చేస్తుండేవి. ఇంతలో అంత్యక్రియల సమయం రానే వచ్చింది. ఇప్పటి వరకూ భౌతికంగానైనా తమ్ముడ్ని కనులారా చూస్తూ వచ్చిన అన్నకు ప్రాణం నిలవలేదు. సరిగ్గా అంత్యక్రియలు పూర్తవుతున్నాయనగా.. ఆ అన్న గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. వెంటనే కుప్పకూలిపోయాడు. దీంతో అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు బంధుమిత్రులు. కానీ ప్రయోజనం లేక పోయింది. ఆ సరికే అన్న సచిన్ చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

చాలా చిన్న వయసు. ఇంకా ఎంతో జీవితం ఉంది. ఈ లోగా ఒకరి వెంట ఒకరు పైలోకాలకు తరలిపోవడంతో.. ఆ ఇంట అంతులేని విషాదం. రోజు వ్యవధిలో చేతికొచ్చిన ఇద్దరు కొడుకుల అకాల మరణం పాలవడంతో..తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ ఇంట తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. ఒకరి చావుకు వస్తే.. ఇద్దరి చావులను చూడాల్సి రావడంతో తట్టుకోలేక పోయారు బంధువులు. ఈ పెను విషాదానికి చలించిన బంధుమిత్రుల రోదనలు సైతం మిన్నంటడంతో ఈ ప్రాంతమంతా తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..