శుభ ముహూర్తంలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు అదే సమయానికి పాడెక్కాడు. బాజా.. భజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లిపండిట్లో చావుడప్పులు, ఆర్తనాదాలు ఉసూరుమనిపించాయి. అటు వధువు కుటుంబంలో విషాదం అలముకుంది. శనివారం రాత్రి 11.గంటల 27నిమిషాలకు పెళ్లి… 10 గంటలకు వరుడు మృతి. ఇంతటి విషాద సంఘటన గురించి ఎక్కడైనా విన్నారా..? వరుడు మృతి చెందడంతో అటు వధువు ఇంట్లో కూడా విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య, మల్లమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు నరేష్ (25)కి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమయింది. 08వ తేదీ శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు వీరి వివాహం. వరుడి ఇంటి వద్దే పెళ్లి వేడుక నిర్వహిస్తుండడంతో బంధు మిత్రులు వధువు తీసుకువచ్చేందుకు వెళ్లారు.
ఇంతలోనే వరుడు నరేష్ తనకు చాత కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో.. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి ఇంటికి తీసుకువచ్చారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వరుడు ఆ నిద్రలోనే అనంతలోకాల్లో కలిసిపోయాడు. పడుకున్న నరేష్ లేవకపోవడంతో.. మళ్లీ ఏమయిందని డాక్టర్‌ని పిలిచి టెస్ట్ చేయగా మృతి చెందాడని తెలిపారు. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అటు వధువు ఇంటివద్ద కూడా విషాదం అలుముకుంది.