సీఎం రేవంత్ ఏడాది పాలనపై భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ స్పందించారు. ప్రజామోదం లభించేలా ఆయన పాలన లేదన్నారు. రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ కోసం తహతహలాడుతున్నారన్నారు ఈటల. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆరు మోసాలు, అరవైఆరు అబద్దాలని విరుచుకుపడ్డారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఈటల కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోల్చలేమన్నారు ఈటల రాజేందర్. కేసీఆర్ కుటంబం కోసం పనిచేశారన్న విమర్శలు వచ్చాయన్నారు. మోదీకి ప్రజలే కుటుంబమన్నారు. మోదీ ప్రతీక్షణం దేశం కోసమే ఆలోచిస్తారన్నారు ఈటల. గత పదేళ్ళ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేసిన ఘనత ఒక్క నరేంద్ర మోదీకే తగ్గుతుందన్నారు ఈటల.
కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటి అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు ఈటల రాజేందర్ . అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అలాగే తెలంగాణలో అర్బన్ నక్సలైట్లతో కూడిన ప్రభుత్వం ఉందన్న బీజేపీ నేతల ఆరోపణలతో తాను ఏకీభవించడం లేదన్నారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. 2023లో తెలంగాణలో అధికారం మిస్ అయిందన్నారు ఈటల రాజేందర్. మోదీ విజన్ ఉన్న లీడర్ అన్న ఆయన, ప్రజల ఆలోచనా విధానాలకు అనుగుణంగా ముందుకెళ్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణ చేస్తుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కోట్ల రూపాయల ధర పలికే భూమిని మార్కెట్ రేటుకు తీసుకోవడం సరికాదన్నారు. మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఈటల రాజేందర్. పేదల ఇళ్లను కూల్చేస్తే ఆ ధరను లెక్కించి ఇవ్వాలన్నారు. బుల్డోజర్లు క్రిమినల్స్ ఇళ్లపైకి వెళ్తే తప్పులేదన్నారు. కానీ తమ కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నవారి పైకి తీసుకెళ్లడం సరికాదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..