దొంగలు ఇళ్లల్లోకి చొరబడడం, దోచుకోవడం సర్వత్రా మామూలు విషయమే.. కానీ, అదే దొంగలు ఓ పేరున్న ప్రజాప్రతినిధి ఇంట్లో చొరబడితే..? కట్టుదిట్టమైన భద్రత మధ్య, అడుగడుగునా సెక్యూరిటీ బలగాల మధ్య ఉండే బడా నేతల ఇళ్లకే దొంగల బెడద అంటే ఇక సామాన్య జనం పరిస్థితి చెప్పేది ఏముంది? ఇంతకీ అసలేం జరిగింది? ఆ ప్రజాప్రతినిధి ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా? బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో తాజాగా దొంగలు హల్చల్ చేశారు. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగలు చొరబడడం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది.
నిన్న అర్ధరాత్రి బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడినట్లుగా సమాచారం. ఆ దొంగ దాదాపు గంటన్నర పాటు డీకే అరుణ ఇంటి కిచెన్‌లోనే ఉన్నట్లు తెలిసింది. అంతటితో ఊరుకోకుండా కిచెన్‌లో ఉన్న సీసీ కెమెరాని కూడా ఆ దొంగ కట్ చేశాడట. ఆ దుండగుడు డీకే అరుణ ఇంట్లో దాదాపు రెండు గంటల పాటు గడిపినట్లు తెలుస్తోంది. బడా నేత ఇంటికే వచ్చి ఇలా ప్రవర్తించడం వల్ల రేపు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆ దొంగ కనీసం ఊహించి కూడా ఉండడా అంటున్నారు పలువురు.
ఈ విషయంపై డీకే అరుణ వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముసుగు, గ్లౌజులు ధరించి ఆ దొంగ ఇంట్లోకి చొరబడి కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు వాచ్ మెన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే.. దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరట. ఇప్పటివరకు ఆ దుండగుడి గురించి సమాచారం లభించలేదు. జూబ్లీహిల్స్ పీఎస్‌గా ఈ ఘటనపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందిస్తూ.. ఇందులో కచ్చితంగా కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తనకు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.