Telangana Elections: రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన బీజేపీ అధిష్టానం.. తొలి జాబితాలోనే గోషామహల్ అభ్యర్థిగా

ఎమ్మెల్యే రాజాసింగ్‌ భారీ ఊరట లభించింది. రాజా చెయ్యేస్తే ఎలా ఉంటుంది. ఇంకెలా ఉంటుంది.. ఇదిగో ఇలాగే ఉంటుంది. మనం చెప్పుకునేది రాజకీయాల్లో రైజింగ్‌స్టార్‌ రాజాసింగ్‌ గురించే. ఎన్నికలముందు మళ్లీ తెలంగాణలో ఆ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది బీజేపీ. ఫైరింగ్‌మీదుండే లీడర్‌ని లైన్‌లో పెట్టింది. సస్పెన్షన్‌ ఎత్తేసి పార్టీ ఎమ్మెల్యేకి ఆహ్వానించింది. ఫస్ట్‌ లిస్ట్‌లోనే ఉంటానన్న ఆ లీడర్‌ జోస్యమే చివరికి నిజమైంది.

Telangana Elections: రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన బీజేపీ అధిష్టానం.. తొలి జాబితాలోనే గోషామహల్ అభ్యర్థిగా
MLA Raja Singh

Updated on: Oct 22, 2023 | 12:08 PM

హైదరాబాద్‌, అక్టోబర్ 22: ఎమ్మెల్యే రాజాసింగ్‌ భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ అధికారికంగా ప్రకటించింది. రాజాసింగ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ గత ఏడాది సస్పెన్షన్‌ చేసిన సంగతి తెలిసిందే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్‌ను బరిలోకి దింపే అవకాశం ఉంది. ఈమేరకు బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజా సింగ్ పేరును పార్టీ అధిష్టానం చేర్చింది.

తెలంగాణలో బీజేపీకి బూస్ట్‌లాంటి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆయన. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు తలనొప్పులు తెచ్చిపెట్టటంతో.. ఏడాదికాలంగా ఆయన్ని దూరంపెట్టింది కమలంపార్టీ. ఎన్నికలవేళ ఆయనకోసం మళ్లీ తలుపులు తెరిచింది. సిట్టింగ్‌ సీటునుంచి మళ్లీ ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామాలను ముందే ఊహించిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎన్నికల బరిలో మరోసారి తలపడేందుకు రెడీ అయ్యారు.

రాజాసింగ్ సస్పెన్షన్‌ ఎత్తివేత

తెలంగాణలో ఫస్ట్ లిస్ట్‌తో పాటు బీజేపీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో రాజాసింగ్ సస్పెన్షన్‌ ఎత్తివేత కూడా ఒకటి. తెలంగాణలో ఏడాదికాలంగా పక్కనపెట్టిన రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు. దీంతో ఫస్ట్‌ లిస్ట్‌లోనే గోషామహల్‌ అభ్యర్థిగా రాజాసింగ్‌ పేరుని కూడా ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. పార్టీ పక్కనపెట్టినా ఇన్నాళ్లుగా తన పని తానుచేసుకుపోతున్నారు రాజాసింగ్‌.. అధినాయకత్వం సస్పెన్షన్‌పై పునరాలోచిస్తుందని, తనకే టికెట్‌ ప్రకటిస్తుందని రెండ్రోజులక్రితమే చెప్పారు. చివరికి అదే జరిగింది.

రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయించేందుకు..

రాజాసింగ్‌పై పోయినేడాది ఆగస్టు 23న బీజేపీ స‌స్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చ‌ర్యలు తీసుకుంది. శాస‌నస‌భాప‌క్ష ప‌ద‌వినుంచి కూడా తొల‌గించి పార్టీ కార్యకలాపాలకు రాజాసింగ్‌ని దూరం పెడుతూ వచ్చింది. హైదరాబాద్‌లో వేరే కార్యక్రమాల్లో కనిపిస్తున్నా పార్టీ అగ్రనేతల పర్యటనల్లో రాజాసింగ్‌ పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. టీబీజేపీలో కీలక నేతలు మాత్రం రాజాసింగ్‌కి మద్దతిస్తూ వచ్చారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయించేందుకు బండి సంజయ్‌ గట్టి ప్రయత్నాలే చేశారు. రాజాసింగ్‌ని కలుసుకున్న ఈటల రాజేందర్‌ ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని పార్టీ పెద్దల్ని కోరారు. విజయశాంతి కూడా రాజాసింగ్‌కి అనుకూలంగా ట్వీట్‌ చేశారు. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాజాసింగ్‌ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇంటాబయటా చర్చనీయాంశమయ్యాయి.

మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న..

ఈసారి గోషామహల్‌లో రాజాసింగ్‌కి టికెట్‌ ఇవ్వరన్న ఆలోచనతోనే మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రంగౌడ్‌ సీరియస్‌గా ప్రయత్నాలు చేశారు. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విక్రంగౌడ్‌ గోషామహల్‌లో పార్టీ నాయకత్వం తనకే అవకాశం ఇస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న రాజాసింగ్‌ని పక్కనపెడితే వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని పార్టీ భావిస్తోంది. అందుకే సస్పెన్షన్‌ వేటువేసి దాదాపు 14నెలల కాలం కావటం, పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా రాజాసింగ్‌ విషయంలో సుముఖంగా ఉండటంతో తన నిర్ణయంపై పునరాలోచించి రాజాసింగ్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

బీఆర్‌ఎస్‌ పెండింగ్‌లో పెట్టటంతో..

గోషామహల్‌ టికెట్‌ని బీఆర్‌ఎస్‌ పెండింగ్‌లో పెట్టటంతో నిన్నటిదాకా రాజాసింగ్‌ పార్టీ మార్పుపై ప్రచారం జరిగింది. కొన్నాళ్లక్రితం ఆయన మంత్రి హరీష్‌రావు కలవటంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. అయితే తన ప్రాణం ఉన్నంతవరకు సెక్యులర్‌ పార్టీల్లోకి వెళ్లబోనని కుండబద్దలు కొట్టారు రాజాసింగ్‌. పార్టీ వీడే ఆలోచనే లేదని తేల్చిచెప్పారు. మరోవైపు రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం పార్టీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రెండ్రోజుల క్రితమే చెప్పారు.

బీసీలకు పెద్దపీట వేయాలని..

ఈసారి బీసీలకు పెద్దపీట వేయాలనుకుంటున్న కమలం పార్టీ నాయకత్వం రాజాసింగ్‌ని దూరం పెట్టడం తమకే నష్టమన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకే టికెట్ల ప్రకటనతో పాటే సస్పెన్షన్‌ ఎత్తివేతపై కూడా ప్రకటన చేసింది. అందుకే వివాదాస్పద వ్యాఖ్యలతో జైలుపాలై బెయిల్‌పై బయటికొచ్చిన రాజాసింగ్‌ని మళ్లీ తెరపైకి తెచ్చింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. రాజా చెయ్యివేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసొచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి