Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు మరింత పదునుపెట్టింది. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ దిశగా దూకుడు పెంచింది. దీనిలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో బిజెపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపీ ఓబీసీ మోర్చా ఛైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తుతోపాటు.. సీట్ల పంపకాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, జనసేన ఇప్పటికే నిర్ణయించగా.. పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు.
మొదటి అడుగు తెలంగాణ నుంచే వేస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని.. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికలపై జరిగిన చర్చల్లో 1-2 సీట్ల మినహా ఏకాభిప్రాయానికి వచ్చామని పవన్ పేర్కొన్నారు. BJP – జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ మూడోసారి దేశ ప్రధాని కావాలని NDA కూటమి భాగస్వామిగా కోరుకుంటున్నానని.. తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ నెల 7న LB స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న BC సదస్సుకు ప్రధాని మోదీతో కలిసి కలిసి పాల్గొననున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అయితే, తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఫైనల్ అయిన నేపథ్యంలో ఒకటి రెండు సీట్ల విషయం కొలిక్కి రావాల్సి ఉంది. జనసేనకు 8 లేదా 9 సీట్లు కేటాయించేందుకు కమలం పార్టీ సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు, ఖమ్మం జిల్లాలో నాలుగు సీట్లు జనసేనకు కేటాయించాలని బీజేపీ భావిస్తోంది. పొత్తులో భాగంగా పవన్ పార్టీకి..కూకట్‌పల్లి, తాండూర్, ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్‌కర్నూల్ కేటాయించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. గతంలో జనసేన 30కి పైగా అభ్యర్థులను తెలంగాణ ఎన్నికల బరిలో నిలపాలని భావించింది. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన స్థానాలకే పరిమితం కానుంది.
ఈ నెల 7న LB స్టేడియంలో @BJP4Telangana అధ్వర్యంలో జరగనున్న BC సదస్సు కు ప్రధాని శ్రీ @narendramodi గారితో కలిసి పాల్గొననున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#TelanganaElection2023 #JSPBJPAlliance
— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) November 4, 2023
బీజేపీ ఇప్పటికే మూడు విడతల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 52, మలి విడతలో ఒక్కరికి, మూడో లిస్టులో 35 మందికి స్థానం కల్పించింది. ఇంకా 31 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. త్వరలో ప్రకటించనున్న నాలుగో జాబితాలో జనసేనకు కేటాయించిన సీట్లతో పాటు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న మిగిలిన అభ్యర్ధుల పేర్లపై స్పష్టత రానుంది.
తాజాగా పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి భేటీతో త్వరలోనే ఈ కసరత్తు పూర్తి చేసి అభ్యర్థులను ప్రకటించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. మరి కమలం, గ్లాసుల కాంబినేషన్ ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..