తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నారు. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. మరోవైపు పొత్తు చర్చలతో భారతీయ జనతా పార్టీ శిబిరంలో హడావుడి కనిపిస్తోంది. జనసేనతో తెలంగాణలో పొత్తు ఖాయమైంది. జనసేనకు 8 సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ రెండు పార్టీల పొత్తుతో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఎలక్షన్‌కి అతికొద్ది సమయం మాత్రమే ఉంది. నామినేషన్లు కూడా మొదలయ్యాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై వేగంగా కసరత్తు చేస్తోంది బీజేపీ. మరోవైపు మిత్రపక్షమైన జనసేనతో మైత్రీ బంధాన్ని కూడా కొనసాగిస్తోంది. జనసేనతో పొత్తు చర్చలు కొలిక్కివచ్చాయి.
జనసేనకు 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకారించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు స్థానాలతో పాటు మరో మూడు సీట్లను జనసేనకు కేటాయించింది. ఖమ్మం, వైరా, మధిర, అశ్వారావుపేట, కొత్తగూడెంతో పాటు నాగర్‌కర్నూల్, కోదాడ, కూకట్‌పల్లి స్థానాల్లో జనసేన పోటీచేయబోతుంది. మరోవైపు శేరిలింగంపల్లి స్థానంపై పీటముడి కొనసాగుతోంది. శేరిలింగంపల్లి కోసం జనసేన పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీలో శేరిలింగంపల్లి స్థానంపై తీవ్రపోటీ కొనసాగుతోంది. ఈ నెల 7న మోదీ పర్యటన తర్వాతే ఈ సీటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మూడు విడతల్లో 88మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మిగిలిన స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. జనసేనకు కేటాయించే స్థానాలు మినహా మిగిలిన అన్ని సీట్లకు నాలుగో విడతలో అభ్యర్థులను ప్రకటించే కసరత్తు చేస్తోంది.
ఈ నెల 7న బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పవన్‌కల్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఎన్డీయేలో జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ.. బీజేపీ కూటమిలో లేని టీడీపీతో ఏపీలో పొత్తుపెట్టుకుంది. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీతో కలిసి వెళ్తున్నారు పవన్. మరి తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోయినప్పటికీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…