Thai Airlines: థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిందా?… పక్షి ఢీకొట్టిందన్న పైలెట్లు

ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్‌లో విమానం ప్రమాదం మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్‌...

Thai Airlines: థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిందా?... పక్షి ఢీకొట్టిందన్న పైలెట్లు
Thai Airlines

Updated on: Jul 20, 2025 | 9:03 AM

ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్‌లో విమానం ప్రమాదం మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు పైలట్లు. విమానం ల్యాండింగ్‌ సమయంలో పక్షి ఢీకొట్టిందని ఎయిర్‌ అధికారులకు పైలట్లు సమాచారం ఇచ్చారు. అయితే రన్‌వేపై పక్షి ఢీకొన్న ఆనవాళ్లు లేవని అధికారులు నిర్దారణకొచ్చారు. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మొన్నటికి మొన్న ఇలాగే సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఓ విమానం తిరిగి చెన్నైలో దిగింది. చెన్నై-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. అప్రమత్తమైన పైలట్‌.. విమానాన్ని తిరిగి చెన్నైలోనే ల్యాండ్‌ చేశారు. రెండు గంటలుగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. చివరికి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది స్పైస్‌ జెట్‌.

ఇక అంతకు కొద్ది రోజుల ముందు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానంలో రన్‌ వేపైకి రాగానే సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలెట్‌ ఫ్లైట్‌ను నిలిపివేశారు. మరో విమానంలో ముంబైకి ప్రయాణికులను తరలించారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా విమానం ఏ12479 ను ఓపక్షి ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణెలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ విమానంలోని ప్రయాణీకులను ఢిల్లీకి పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది ఎయిర్ ఇండియా.