Big News Big Debate: పార్లమెంట్‌ ఎన్నికల్లో.. ఎవరు, ఎవరికి పోటీ!

|

Feb 21, 2024 | 7:00 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితం... రాష్ట్ర రాజకీయముఖచిత్రాన్నే మార్చేసింది. బీఆర్‌ఎస్‌కు షాకిస్తూ కాంగ్రెస్‌ అధికారం చేపడితే.. అనూహ్యంగా బీజేపీ సైతం పుంజుకుంది. దీంతో, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో... ఎవరు ఎవరికి పోటీ కాబోతున్నారనే చర్చ మొదలైంది. కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా అగ్గికి ఆజ్యం పోస్తున్నాయి. పొలిటికల్‌ వేడిని పెంచుతున్నాయి.

Big News Big Debate: పార్లమెంట్‌ ఎన్నికల్లో.. ఎవరు, ఎవరికి పోటీ!
Big News Big Debate
Follow us on

పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జరగబోయేది త్రిముఖ పోరా? ద్విముఖ పోరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత… జోష్‌ మీదున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ… ఎంపీ ఎన్నికలకు బస్తీమే సవాల్‌ అంటున్నాయి. కాంగ్రెస్‌తోనే పోటీ అని కమలనాథులు అంటుంటే… బీజేపీతోనే తమ యుద్ధం అంటోంది కాంగ్రెస్‌. బీఆర్‌ఎస్‌ తమకు పోటీయే కాదన్నట్టుగా మాట్లాడుతున్నాయ్‌.

తెలంగాణ విజయసంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్‌రెడ్డి.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ శకం ముగిసిపోయిందన్నారు. తమ ప్రధానప్రత్యర్థి కాంగ్రెస్‌ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టేది బీజేపీయే కాబట్టి… రాష్ట్రం నుంచి భారీగా ఎంపీస్థానాలు గెలిస్తే తెలంగాణకు మంచి జరుగుతుందన్నారు కిషన్‌రెడ్డి. అటు కాంగ్రెస్‌ కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తోంది. తమ పోటీ బీజేపీతోనే తప్ప బీఆర్‌ఎస్‌తో కాదన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు హస్తం నేతలు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా .. డబుల్‌ డిజిట్‌ స్థానాలు గెలిచేందుకు కృషిచేస్తామంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన .. తామేం తక్కువ కాదంటోంది బీఆర్‌ఎస్‌. తెలంగాణను తెచ్చింది తాము, రాష్ట్రాన్ని కాపాడుకున్నది తాము, అభివృద్ధి చేసుకున్నది తాము అంటున్నారు గులాబీనేతలు. పార్లమెంటులో తెలంగాణవాణి వినిపించాలంటే.. మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలవాల్సిందే అంటున్నారు. అటు హస్తం.. ఇటు కమలం విసురుతున్న సవాళ్లను కారు పార్టీ ఎలా ఎదుర్కొంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నీళ్లపోరుతో ప్రజాందోళనలకు సిద్ధమవుతున్న గులాబీదళం.. సత్తా చూపిస్తామంటోంది. దీంతో, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరు, ఎవరికి పోటీ కాబోతున్నారన్నదీ రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…