
Big News Big Debate: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద టాస్క్ 6 గ్యారెంటీలు. ఇచ్చిన హామీలే అమలు లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు కూడా అంతే బలవగా వెంటాడుతున్నాయి. గ్రామసభలతో పథకాలకు ధరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమైన సర్కార్ నిధుల వేటలో పడింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం, డిప్యూటీ సీఎంల లక్ష్యం కూడా నిధుల సమీకరణే.
గ్యారెంటీలు అమలుకు గ్రామసభలతో సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.. 100 రోజుల్లో అమలుచేయకపోతే ప్రజాఉద్యమాలతో నిలదీస్తామంటున్నాయి ప్రతిపక్షాలు.. మొత్తానికి 6 గ్యారెంటీలపైనే చర్చ అంతటా చర్చ జరుగుతోంది. వీటిచుట్టూనే పార్టీల వ్యూహాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి.
అయితే ఖాళీగా ఉన్న ఖాజానాతో ఇచ్చిన హామీలు అమలు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. రైతుబంధు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా ఇప్పటికీ లబ్ధిదారులకు జమ కాలేదు. ఇక గృహలక్ష్మి సహా పలు పలు నగదు బదిలీ పథకాలు అమలు చేయడానికి నిధుల కోసం చూస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బాటపట్టారు.
చట్టబద్దంగా రావాల్సిన హామీలపైనే కాదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీలకు కేంద్ర సాయం కోరుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వివిధ స్కీముల కింద గ్రాంట్లు, అవసరమైతే FRBM పరిమితి పెంచి రుణాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. తమ లక్ష్యం 6 గ్యారెంటీలు అమలు అంటున్నారు మంత్రులు, సీనియర్ నాయకులు.
వందరోజుల్లో పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కార్ సకల ప్రయత్నాలు చేస్తోంది. అమలు చేయలేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి విపక్షాలు. మరి నిధులు సేకరించి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా? గతంలో కేంద్రం సహకరించడం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేసింది. మరి కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ ప్రభుత్వం నుంచి చేయూత అందేనా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..