
తెలంగాణలోని మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త అందించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఈ పథకం ఎప్పటినుంచో కొనసాగుతోండగా.. తాజాగా భట్టి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జాప్యం జరగకుండా త్వరతగతిన రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు త్వరగా రుణాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇక మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీపై ఆలస్యం జరగకూడదని భట్టి విక్రమార్క తెలిపారు. అర్హులైన మహిళలందరికీ త్వరగా చీరలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఆధారంగా ఈ పథకానికి లబ్దిదారులను గుర్తించి అందించాలన్నారు. త్వరతగతిన ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. త్వరలో పట్టణాల్లోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. అధికారుల వేగవంతంగా వీటిని అందించేలా చేస్తామని హమీ ఇచ్చారు. ఈ పథకాలను అర్హులైన మహిళలందరూ ఉపయోగించుకుని ప్రభుత్వం ద్వారా లబ్ది పొందాలన్నారు. మహిళల రద్దీ లేకుండా సజావుగా వీటిని పంపిణీ చేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇందిరమ్మ చీరలు, మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాల అమలుపై చర్చించేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్, మెప్మా ఉన్నతాధికారులతో భట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల అభివృద్ది కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, వీటిని అర్హులైన మహిళలందరికీ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతీఒక్క మహిళ ప్రభుత్వం నుంచి లబ్ది పొందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.