
పార్లమెంట్ సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆంజనేయ స్వామివారిని దర్శిస్తూ హారతి ఇస్తున్నట్టు ఏఐ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. స్వతహాగా ముస్లిం మతస్థుడు అయిన ఓవైసీ.. హిందూ దేవుడికి మొక్కుతున్నట్లుగా ఉన్న ఈ వీడియోలు పెద్ద దుమారం లేపుతున్నాయి. కులమతాల మధ్య చిచ్చు రేపి, వివాదాలు సృష్టించే ఇలాంటి పోకడలు సమాజానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టెక్నాలజీ ముసుగులో చేసే ఇలాంటి చేష్టలను ఏ మాత్రం సహించేది లేదని.. అందులోనూ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిని ఇందులో భాగం చేయడం సరికాదని అంటున్నారు. దేనికైనా ఓ హద్దు అనేది ఉంటుందని.. AI వచ్చాక ఎవరికి వారు ఏది పడితే అది ఇలాంటివి సృష్టిస్తుండడం బాగా అలవాటై పోయిందని విమర్శిస్తున్నారు. దీనిపై AIMIM సోషల్ మీడియా, అడ్మిన్ సభ్యుడు మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ పోలీసులను ఆశ్రయించారు.
అసదుద్దీన్ ఒవైసీ నకిలీ AI-జనరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో ఏ మాత్రం నిజం కాదని.. తప్పుదారి పట్టించే ఇలాంటి కంటెంట్‌ను నమ్మవద్దని, షేర్ చేయవద్దని, ఫార్వార్డ్ చేయవద్దని సూచిస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ AI-జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేయడం, ఫార్వార్డ్ చేయడం లేదా ఎవరైనా ప్రసారం చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.