
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఓవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ మద్దతు కూడగట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మైనారిటీ నేతకు చోటు కల్పించాలని చూస్తోంది. మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. మైనారిటీ మంత్రిగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్‌కు అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చి సింపతీ ఓట్లను కైవసం చేసుకోవాలని చూస్తుంటే.. ఈ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై అటు గ్రామీణ ప్రాంతాల్లో, ఇటు పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం, సామాజిక సమీకరణాల ద్వారా గట్టెక్కాలని చూస్తోంది.
గత కొన్నాళ్లుగా తెలంగాణలో మైనారిటీలు ఎంఐఎం ఉన్నచోట ఆ పార్టీకి, ఆ పార్టీ పోటీలో లేని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత MIM ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొంత సఫలీకృతమైంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర మంత్రివర్గంలో అనేక వర్గాలకు చోటు కల్పించినప్పటికీ రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలకు మాత్రం ఇంతవరకు చోటు లభించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్క మైనారిటీ నేత కూడా లేకపోవడం ప్రధాన కారణం. ఆ తర్వాత MLC గా మైనారిటీలకు అవకాశం కల్పించినప్పటికీ.. మంత్రివర్గ విస్తరణలో ఆ వర్గానికి మాత్రం చోటు కల్పించలేదు. ఈసారి జరగబోయే విస్తరణలో మైనారిటీకి చోటు కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.