
అధిక వడ్డీ పేరుతో బాధితుడిని వేధిస్తూ, అతని ఆటోను బలవంతంగా అపహరించిన ముగ్గురు నిందితులను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ కాలనీకి చెందిన తాహేర్ అలీ అనే ఆటో డ్రైవర్ తన అవసరాల నిమిత్తం పిట్టలవాడకు చెందిన పండిగొట్టి కొండయ్య అతని భార్య పండిగొట్టి లక్ష్మి వద్ద రూ.70,000 లను 10% వడ్డీతో అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న అనంతరం నెలవారీ వడ్డీ చెల్లిస్తూ ఇప్పటివరకు సుమారు రూ.1,33,000 చెల్లించాడు. అయితే ఇంకా అప్పు తీరలేదని అసలు ఇంకా అలాగే ఉందని వెంటనే చెల్లించాలంటూ బాదితుడిని వేధింపులకు గురి చేశారు.
అక్కడితో ఆగకుండా బాదితుడి ఉపాధిపై దెబ్బ కొట్టేలా అతని ఆటోను ఇంటి నుండి బలవంతంగా లాక్కెల్లారు. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు తన గోడును పోలీసులకు వెళ్లబోసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
అరెస్ట్ అయిన నిందితులు A1 పండిగొట్టి కొండయ్య, A2 పండిగొట్టి లక్ష్మి , A3 సిండే మురళి @ మాధవ్, పిట్టలవాడ, ఆదిలాబాద్ కు చెందిన వారిగా తెలిపారు పోలీసులు. అనుమతి లేకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..