అంచనాలు తలకిందులయ్యాయి..! జనసంద్రంగా మారిన మేడారం.. కీలక ఘట్టానికి చేరుకున్న నాగోబా జాతర..

|

Jan 28, 2024 | 6:15 PM

పదవే పోదాము గౌరి.. మహా జాతరను జూడ.. అంటూ మేడారం వైపు దారితీస్తోంది యావత్ తెలంగాణ సమాజం. వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయానికి పోటెత్తింది భక్తజనం. శుక్రవారం నుంచి వరదలా వస్తున్నారు భక్తులు. అయితే, అధికారుల ముందస్తు అంచనా తప్పింది. మేడారం జనసంద్రంగా మారిపోయింది.

అంచనాలు తలకిందులయ్యాయి..! జనసంద్రంగా మారిన మేడారం.. కీలక ఘట్టానికి చేరుకున్న నాగోబా జాతర..
Medaram Jathara and Nagoba Jathara
Follow us on

పదవే పోదాము గౌరి.. మహా జాతరను జూడ.. అంటూ మేడారం వైపు దారితీస్తోంది యావత్ తెలంగాణ సమాజం. వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయానికి పోటెత్తింది భక్తజనం. శుక్రవారం నుంచి వరదలా వస్తున్నారు భక్తులు. అయితే, అధికారుల ముందస్తు అంచనా తప్పింది. మేడారం జనసంద్రంగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు మేడారం దారిపట్టారు. ఊహించని విధంగా భక్తులు పోటెత్తడంతో మేడారం పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. శుక్రవారం, శనివారంతో పోల్చి చూసుకుని ఆదివారం లక్ష మించక పోవచ్చని భావించారు అధికారులు. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఆదివారం ఒక్కరోజే మూడు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కు చెల్లించుకున్నారు.

మేడారం-తాడ్వాయి, పస్రా – మేడారం మధ్య ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భక్తులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. చంటి పిల్లలతో వచ్చిన భక్తులు, నెత్తిన బెల్లం ఎత్తుకొని వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.

పోలీసులు కూడా చేతులెత్తేయడంతో మంత్రి సీతక్క రంగంలోకి దిగారు. ఎస్పీని, కలెక్టర్‌నీ అప్రమత్తం చేసి, ట్రాఫిక్ డైవర్షన్స్‌తో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

అటు.. జంపన్నవాగు పరిసరాలన్నీ భక్తజనంతో పోటెత్తాయి.. జంపన్న వాగులో జలకాలాడిన భక్తులు సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ మాత్రం భక్తుల తాకిడితోనే తల్లకిందులైన పోలీసులు.. జాతర సమయంలో కోటీ 50 లక్షల మంది వస్తే ఏర్పాట్లు ఎలా చేస్తారు.. అనే సందేహాలు మొదలయ్యాయి.

అటు… మేడారం జాతర పనులు ఈ నెల 31 లోగా పూర్తి కావాలని డెడ్‌లైన్ విధించింది ప్రభుత్వం. ఇప్పటికే 300 సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. అధికారులు ఎంతవరకు సమాయత్తం అవుతున్నారో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు మంత్రి సీతక్క.

నాగోబా జాతరకు ఏర్పాట్లు..

నాగోబా జాతర… తెలంగాణలోనే మరో మహా జాతర. ఫిబ్రవరి 9న జరిగే నాగోబా జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. నాగశేషుడిని పూజించే మెస్రం వంశీయులు… కెస్లాపూర్ ఆలయం నుంచి ఈనెల 21న గంగా జల సేకరణ కోసం పయనమయ్యారు. మహా పాదయాత్రగా సాగి.. మంచిర్యాల జిల్లా‌ జన్నారం మండలం గోదావరి నదీ పరీవాహకంలోని హస్తినమడుగు చేరుకున్నారు.

ధవళ వస్త్రాలతో, అత్యంత నిమయ నిష్టలతో, రాళ్లు రప్పలు దాటుతూ కొండ కోనల్లో దాదాపు 125 కిలోమీటర్లు ప్రయాణించి హస్తినమడుగులో అడుగు పెట్టారు. పుణ్య గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి, గంగాజలాన్ని సేకరించారు. ఐదు మండలాలు, 18 గ్రామాలు , 26 మారుమూల గ్రామాల మీదుగా శ్వేతనాగులా సాగింది గంగాజల మహా పాదయాత్ర.

ఇక్కడ సేకరించిన గంగాజలంతో తిరుగు పయనమయ్యారు మేస్రం వంశీయులు. ఫిబ్రవరి 5న ఇంద్రవెల్లి మండలం ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సకుటుంబ సపరివార సమేతంగా ఫిబ్రవరి 6న కెస్లాపూర్ వెళతారు. ఫిబ్రవరి 9 అమావాస్య రోజు అర్థరాత్రి పవిత్ర గంగాజలంతో నాగశేషుడ్ని అభిషేకించడంతో నాగోబా మహా జాతర మొదలవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..