Cyclone Arnab: తెలంగాణలోని ఈ ప్రాంతాలపై అర్నబ్ ఎఫెక్ట్ : ఈ జిల్లాల్లో వర్షాలు..
అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో మంగళవారం నుంచి వర్షాలు తీవ్రతరం కానున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య తెలంగాణలో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తీవ్రతరం కానున్నాయి. మంగళవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అర్నబ్ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను.. విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తోంది. తుపాను కదలికలు, మేఘాల వ్యాప్తిని బట్టి దాని ప్రయాణ దిశలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. దిశ మారితే నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాన్ని కూడా కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో భారీ గాలులతో పాటు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
తుపాను ప్రభావంతో మంగళవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తుపాను ఉత్తర దిశగా కదిలే క్రమంలో తెలంగాణలో వర్షాల తీవ్రతలో మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని, రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఈ సమయానికి 400 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 200 టీఎంసీలే ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్నబ్ తుపాను వల్ల భారీ వర్షాలు కురిసి జలాశయాల్లోకి నీరు చేరుతుందా? సాగునీటి అవసరాలకు కొంత ఊరట లభిస్తుందా? అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తుఫాన్ లైవ్ ట్రాకింగ్ దిగువన చూడండి..
క్రెడిట్: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..
