Dharan: నిజంగా “దందా” జరిగిందా? ఆధారాలు దొరికాయా? పొంగులేటి పేలుతుందన్న బాంబ్‌ అదేనా..?

|

Oct 24, 2024 | 9:43 PM

ధరణి వచ్చాకే లక్షల ఎకరాల భూకబ్జా జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిషేధిత జాబితా భూములను ఆక్రమించారని కాంగ్రెస్ ఆరోపణ. 'ప్రొహిబిటెడ్' భూములను పట్టా భూమిగా మార్చారన్న కాంగ్రెస్, గత ప్రభుత్వంలో అవకతవకలపై ధరణి కమిటీ ఫోకస్ చేసింది

Dharan: నిజంగా దందా జరిగిందా? ఆధారాలు దొరికాయా? పొంగులేటి పేలుతుందన్న బాంబ్‌ అదేనా..?
Dharani
Follow us on

ధరణి ఓ అద్భుతం అని బీఆర్ఎస్. ధరణి దోపిడీకి కేరాఫ్ అని కాంగ్రెస్‌. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన అసెంబ్లీ వార్‌లో ‘ధరణి’ ఓ ఎలక్షన్‌ టాపిక్ అప్పట్లో. ఎన్నికలయ్యాయి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. మరి ధరణిపై లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటి? దీపావళి లోపు పొలిటికల్‌ బాంబ్‌ పేలుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వాటిలో ధరణి పేరు కూడా ప్రస్తావించారు. అంటే.. ధరణి పేరుతో భూదందా ఏమైనా జరిగిందా? దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయా? ఇంతకీ ధరణి విషయంలో ఏం చేయబోతున్నారన్నదీ తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

‘భూసమస్య’ అనేది చూడ్డానికి నాలుగక్షరాలే. కాని, ప్రభుత్వాలను మార్చేంత శక్తి ఉంది. భూమి పోతోందన్న ఆవేదన ఉంటే.. ఎన్ని రైతు బంధులు, ఎన్ని రైతు భరోసాలు ఉన్నా జనం పట్టించుకోరు. భూమికి సంబంధించిన ఇష్యూ కారణంగా.. ఏపీలో ఎలక్షన్‌ మూడ్‌ మారిపోయింది. అదే భూ సమస్యను ధరణి రూపంలో హైలెట్‌ చేయడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ‘భూసమస్య’ అని తేలిగ్గా తీసుకోడానికి లేదు. అందుకే, రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తోంది.

ధరణిని ప్రవేశపెట్టడానికి ముందు.. నాటి సీఎం కేసీఆర్‌ 2020లో ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ గుర్తు చేసుకోవాలిక్కడ. ‘తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇవాళ అంత సంతోషంగా ఉన్నాను’ అంటూ మాట్లాడారు కేసీఆర్. కారణం.. ఆనాడు ధరణిని ప్రవేశపెడుతుండడమే. భూ నిర్వహణలో అవినీతి రహితంగా, బలహీనులకు మేలు చేసే విధంగా, అత్యంత సరళీకృత చట్టాలు-విధానాలు తీసుకొచ్చాం అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అందులో భాగంగానే రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాలను పూర్తిగా రద్దు చేశారు. తహశీల్దారు నుంచి జాయింట్ కలెక్టర్ వరకు ఎవరికీ విచక్షణాధికారాలు లేకుండా చేశారు. వీలైనన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నిమిషాలు లేదా గంటల వ్యవధిలోనే పట్టాదారు పాస్‌బుక్‌లో చేర్పులు, తొలగింపులు జరిగిపోతాయన్నారు. మ్యుటేషన్ కూడా వెంటనే అయిపోతుందని చెప్పారు. ఈసీని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఎంక్వైరీ చేసే పద్దతి లేకుండానే వారసత్వ భూమిని వారసులకు ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్‌ చేయకూడని భూములను ఆటో లాక్ చేస్తారు. రెవెన్యూ కోర్టులను రద్దు చేసి ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్స్‌ తీసుకొచ్చారు. ఇలా పాజిటివ్‌ అంశాలు చాలానే ఉన్నాయి. అయినా సరే.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధరణిని ఓ ప్రచారాస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్.

ధరణిపై ఆనాటి మాటల యుద్ధాన్ని ఎవరూ మరిచిపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆలస్యం ధరణిని రద్దు చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రతి ఊరు, ప్రతి వాడా ప్రచారం చేశారు. పేదల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూమిని ధరణి పేరుతో మళ్లించారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన 25 లక్షల లావాదేవీలపై విచారణ జరగాలని కూడా ఆనాడు డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ సింపుల్ సాఫ్ట్ వేర్ కాదు.. దోపిడీ చేసేందుకు తీసుకొచ్చారంటూ ఎన్నెన్ని విమర్శలు చేశారో. దీంతో ధరణి ఎంత గొప్పదో చెబుతూ స్వయంగా కౌంటర్ అటాక్ చేశారు ఆనాటి సీఎం కేసీఆర్. ధరణిని రద్దు చేస్తామనే వాళ్లనే బంగాళాఖాతంలో వేయాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ధరణిని రద్దు చేస్తే.. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అగిపోతాయంటూ ప్రచారం చేశారు. అదే సమయంలో బీజేపీ కూడా ధరణిపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ధరణిని రద్దు చేయబోం గానీ.. అందులో ఉన్న సమస్యలను పరిష్కారిస్తామంటూ చెప్పుకొచ్చింది.

అలా.. ఓ అద్భుతం అంటూ తీసుకొచ్చిన ధరణి ఎన్నికల అంశంగా మారి.. చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోడానికి గల కారణాల్లో ఒక కారణమై నిలిచింది. అందుకే, అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన కోసం సబ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీటర్‌, అడ్వొకేట్‌ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సహా CCLA మెంబర్‌ కన్వీనర్‌ను ధరణి కమిటీలో సభ్యలుగా చేర్చింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 10 గ్రామాలు, నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేసుకున్నారు.

ఇంతకీ ధరణితో సమస్యలు నిజమా? తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమి.. ఇకపై నీదా కాదు అంటే ఎవరికైనా ప్రాణం పోతుంది. సకల భూ సమస్యలకు సర్వరోగ నివారిణిగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యల కేంద్రంగా మారిందన్నది ముమ్మాటికీ నిజం. ధరణి పోర్టల్ ఎంతోమంది రైతులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. కొంతమంది రైతుల పాలిట మాత్రం శాపంగా మారింది. ధరణి పోర్టల్ వచ్చాక 22 లక్షల మంది రైతులు బాధితులుగా మారాలంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయ్’ అంటూ అసెంబ్లీ సాక్షిగా అప్పుడు మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్‌రావు కూడా ఒప్పుకున్నారు. కానీ, ఒకట్రెండు లోపాలు చూపించి మొత్తం ధరణినే రద్దు చేయడం సరికాదన్నది బీఆర్ఎస్ వాదన.

ఆనాడు కేటీఆర్ చెప్పినట్టు.. ధరణిలో ఒకట్రెండు లోపాలు లేవు. చాలా సమస్యలు పుట్టుకొచ్చాయి. ఎప్పుడో పది, పదిహేనేళ్ల క్రితం అమ్మేసుకున్న భూమి.. తిరిగి ఆ వ్యక్తి చేతికే తెచ్చిన ఘనత ధరణిది. నమ్మకం కలగడం లేదా..! 45 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి తన భూమిని అమ్మేశాడు. ధరణి వచ్చాక ఏం జరిగిందో తెలుసా. ఆ వ్యక్తి పేరు మీదకు ఏకంగా 697 ఎకరాలు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా మొగల్‌పహాడ్ గ్రామంలో జరిగిందీ వింత. ఓ వ్యక్తికి ఎకరం భూమి ఉంటే.. రికార్డుల్లో మాత్రం అదనంగా వచ్చి చేరింది. ఇదీ ధరణి ఘనతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రెవెన్యూ ఆఫీసులోని ఒక కంప్యూటర్‌ ఆపరేటర్ సహాయంతో.. భూమి యజమాని పేరు మార్చి ఇచ్చే అవకాశం ఉండటం ధరణిలో అతిపెద్ద డీఫాల్ట్‌గా చెబుతున్నారు నిపుణులు.

ఏదైనా ప్రాజెక్టుకో, రోడ్డుకో భూమి సేకరించడం తలనొప్పి వ్యవహారం. కాని, ధరణిలో భూ యజమాని పేరు మారిస్తే చాలు.. ధరణిలో యజమాని పేరు మార్చి TSIIC పేరు పెడితే ఖతం.. ఇక భూసేకరణ అయిపోయినట్టే. ఈ వెసులుబాటు అత్యంత ప్రమాదకరం అని ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ధ‌ర‌ణి పోర్టల్‌లో తప్పులు నిజమే. కాని, అవి శాఖాపరమైన తప్పిదాలు కావు, సాఫ్ట్‌వేర్‌తో వచ్చిన చిక్కులు అంటూ ఆనాటి మంత్రులు వివరణ ఇచ్చారు.

సరే.. ఇంతకీ ఏం చేయబోతున్నారు ధరణి విషయంలో. ఇకపై ధరణి ఉండదు అనేది సుస్పష్టం. ఆ ప్లేసులో ‘భూమాత’ అనే పోర్టల్ తీసుకొస్తున్నారు. అలాగని.. ధరణి తెచ్చినంత వేగంగా అయితే కాదు. ధరణిపై ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందుగా అత్యంత సమస్యాత్మకంగా మారిన RoR-2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఆల్‌మోస్ట్‌ ఈ ప్రక్రియ తుది దశకు వచ్చినట్టే. ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్-2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడమే మిగిలింది.

ఇంతకీ ఏముంది RoR-2024 బిల్లులో. బ్రీఫ్‌గా చెప్పుకోవాలంటే.. రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని ఈ ముసాయిదాలో చేర్చారు. సపోజ్.. ఎప్పటిక‌ప్పుడు రికార్డులను స‌వ‌రించ‌డం, ఇప్పటి వ‌ర‌కు పాస్‌బుక్‌లు రాని భూముల స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డం, స‌ర్వే చేసి కొత్తగా భూ హ‌క్కుల రికార్డు త‌యారు చేసుకునే అధికారాన్ని క‌ల్పించ‌డ‌ం.. ఇవన్నీ కొత్త చ‌ట్టంలో పెట్టారు. రిజిస్ట్రేష‌న్, మ్యుటేష‌న్, భూ ఆధార్, ఆబాదీల‌కు ప్రత్యేక హ‌క్కుల రికార్డు, అప్పీల్, రివిజ‌న్ వంటి సెక్షన్లను ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. త‌హీస‌ల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్లపై వివాదాలు వ‌స్తే అప్పీల్, రివిజ‌న్‌కు కొత్త చ‌ట్టం అవ‌కాశం ఇస్తుంది. క‌లెక్టర్లు లేదా అడిష‌న‌ల్ క‌లెక్టర్ల దగ్గర అప్పీల్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు. త‌ర్వాత సీసీఎల్ఏకు సెకండ్ అప్పీల్ చేసుకోవ‌చ్చు.

పైగా ఈ ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ -2024’ చ‌ట్టం ముసాయిదా బిల్లును 18 రాష్ట్రాల రెవెన్యూ విధానాలను పరిశీలించి మరీ తయారుచేశారు. బీహార్‌లో అమ‌ల్లో ఉన్న మ్యుటేష‌న్ చ‌ట్టాన్ని కూడా అధ్యయ‌నం చేసింది. వాటిలోంచి.. ప్రజలకు ఉపయోగపడే వాటిని ముసాయిదా చట్టంలో చేర్చారు. తెలంగాణ‌లో ఇప్పటి వ‌ర‌కు అమ‌లైన 1936, 1948, 1971, 2020 నాటి చ‌ట్టాల‌ను సైతం నిశితంగా ప‌రిశీలించి, వాటి అమ‌లు వ‌ల్ల వ‌చ్చిన ఫ‌లితాల‌ను బేరీజు వేసుకొని కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. తెలంగాణ‌లో ఆర్‌వోఆర్ చ‌ట్టాల అమ‌లు చేసిన తీరు, ప్రస్తుతం వస్తున్న సమస్యలు, ఇకపై రాబోయే అవ‌స‌రాల‌ను అంచ‌నా వేసి మొత్తం 20 సెక్షన్లతో 23 పేజీల‌తో ముసాయిదాను సిద్ధం చేశారు. రిజిస్ట్రేష‌న్‌, మ్యుటేష‌న్ త‌హ‌సీల్దారే చేస్తారు. కాకపోతే, మ్యుటేష‌న్ చేసే స‌మ‌యంలో విచార‌ణ జ‌రిపే వెసులుబాటు క‌ల్పించారు. అక్కడేమైనా అభ్యంత‌రాలు ఉంటే మ్యుటేష‌న్‌ను ఆపేయొచ్చు. పంప‌కాలు, వార‌స‌త్వం, వీలునామా లాంటి వాటికి మ్యుటేష‌న్ చేసే అధికారం కూడా త‌హ‌సీల్దార్‌కే అప్పగించ‌నున్నారు. ఇప్పుడున్న చ‌ట్టం ప్రకారం.. ఆర్‌వోఆర్ రికార్డుకు, ప‌హాణీకి సంబంధం ఉండేది కాదు. ఈ కొత్త చ‌ట్టంలో హ‌క్కుల బ‌దలాయింపు జ‌ర‌గ్గానే ప‌హాణీలో హ‌క్కుల రికార్డును న‌మోదు చేసేలా నిబంధ‌న విధించారు.

ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ NIC-నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌కి అప్పగించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌ బాధ్యతను విదేశీ కంపెనీ అయిన టెర్రా సీఐఎస్ టెక్నాలజీస్ కంపెనీ చూస్తోంది. రాష్ట్రంలోని భూములను ఓ విదేశీ సంస్థకు కట్టబెట్టడంపై కాంగ్రెస్‌ ఎప్పటి నుంచో విమర్శలు చేస్తోంది. ధరణిని సింగపూర్ కంపెనీకి అప్పగించి.. తెలంగాణలోని రెండున్నర కోట్ల ఆస్తుల్ని తాకట్టు పెట్టారంటూ స్వయంగా మంత్రి పొంగులేటి ఆరోపించారు. సుదీర్ఘ కసరత్తు తరువాత.. NICకి ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒకప్పుడు ఉన్న VRO వ్యవస్థను పునరుద్దరిస్తామని అంటోంది. VRO అనే పేరు ఉండకపోవచ్చు గానీ, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

వీడియో చూడండి…

ఎన్ని చెప్పుకున్నా.. దీపావళికి పేలబోయే పొలిటికల్‌ బాంబ్‌ మీదే ఆసక్తి పెరిగింది. పైగా చెప్పింది ఎవరో కాదు.. స్వయానా రెవెన్యూ మినిస్టర్. కాబట్టే.. ధరణికి సంబంధించిన బాంబే పేలొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ధరణిని ఆధారంగా చేసుకుని లక్షల ఎకరాల భూమిని కబ్జా చేశారనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా నిషేధిత జాబితాలోని భూములను.. ధరణి అం‌దుబాటులోకి వచ్చిన తర్వాతనే ఆక్రమించారనేది కాంగ్రెస్ ఆరోపణ. రికార్డుల్లో ‘ప్రొహిబిటెడ్’ అని ఉన్న భూములను పట్టా భూమిగా మార్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ ఒక్క మార్పుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను కాజేశారనేది బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ చేస్తున్న అతిపెద్ద ఆరోపణ.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ.. ఈ అన్ని అంశాలపైనా ఫోకస్‌ పెట్టింది. అనుమానిత భూముల వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ధరణి వచ్చాక.. అనుమానాస్పదంగా కనిపించిన భూలావాదేవీలను కూడా పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నారు? వాళ్లకు సహకరించిన అధికారులు ఎవరు అనే దానిపై ధరణి కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వాస్తవానికి, ధరణి పోర్టల్‌ అమలులోకి రాకముందు రిజిస్ట్రేషన్‌ ‌చట్టం ప్రకారం.. అమ్మడానికి వీల్లేని భూములను 22 (ఏ) కింద నిషేధిత జాబితాలో ఉంచారు. అయితే, సరిగ్గా ఆ జాబితాలోని భూములే చాలాచోట్ల మాయమైనట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు చెందిన వేల కోట్ల విలువైన ఈనాం, అసైన్డ్ ‌భూములను ధరణి ద్వారా రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా దాదాపు 6 లక్షల ఎకరాల ఈనాం భూములు చేతులు మారాయి. ఇందులో చాలా భూములు ధరణి వచ్చిన తర్వాతనే అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వం భావిస్తోంది.

అంతేకాదు, ధరణిలో నమోదై, పాస్‌ ‌పుస్తకాల్లో చూపుతున్న భూవిస్తీర్ణానికి.. క్షేత్రస్థాయిలోని భూమికి చాలా తేడాలున్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. నల్గొండ జిల్లా పానగల్లును శాంపిల్‌ ‌విలేజీగా తీసుకుని.. అక్కడి భూరికార్డులను పరిశీలించింది కాగ్‌ ‌బృందం. ఈ పరిశీలనలో సేత్వార్‌ ‌రికార్డుకు, పహాణీలకు మధ్య 819 ఎకరాల భూమి తేడా వచ్చింది. ఇలా అనేక గ్రామాల్లో 10 నుంచి 20 శాతం భూమి అదనంగా నమోదైంది. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో జీవో 59 కింద అన్యాక్రాంతమైన కొన్ని భూములు కూడా ఈ జాబితాలోనివే అని ధరణి కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే, పొంగులేటి చెబుతున్న పొలిటికల్‌ బాంబ్‌పైనా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

మొత్తానికి, ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్‌ ప్రభుత్వం. త్వరలోనే ధరణి అనే పేరు మరిచిపోయేలా మార్పులు తీసుకొస్తోంది. ఎన్నికల్లో అజెండాగా మారిన ధరణిని.. భూమాతగా మార్చి మొత్తం భూరికార్డుల వ్యవస్ధనే ప్రక్షాళన చేయబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..