Telangana: బెట్టింగ్ యాప్‌లతో బతుకు ఆగం..వాళ్లే టార్గెట్‌గా.!
మొన్న కోకాపేట్.. నేడు ఘట్‌కేసర్... ఆన్లైన్లో బెట్టింగ్లకు యువకులు పాల్పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువైయ్యాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటననే ఘట్కేసర్‌లొ చోటుచేసుకుంది.
ఆన్లైన్ బెట్టింగ్లకు మరో విద్యార్థి బలయ్యాడు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్లో బెట్టింగ్ పాల్పడుతూ అప్పులు పాలైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న గణేష్ ఆన్లైన్లో బెట్టింగులు పెడుతూ స్నేహితుల వద్ద నుంచి అప్పులు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వలేక ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. గణేష్ వర్ధన్‌పేట్‌కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్‌లకు బానిసలుగా మారిన వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడవ అంతస్తు పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓసాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ గచ్చిబౌలిలో పనిచేస్తున్న మృతుడు ఆన్లైన్ బెట్టింగులకు అలవాటయ్యాడు. వివిధ యాప్‌ల నుంచి ఆన్లైన్లో బెట్టింగులు పెడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో కోకాపేట్‌లో బాయ్స్ హాస్టల్లో ఉంటున్న మృతుడు ఏడవ అంతస్తు పైనుంచి దూకి అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతుడు ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరోసారి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసగా మారి విద్యార్థి మృతి చెందడంతో బెట్టింగ్ యాప్స్‌కి బానిసలుగా మారుతున్న వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెట్టింగులకు పాల్పడి ప్రాణాలు కోల్పోవద్దని సూచిస్తున్నారు.