
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం ఉదయం లాలాగూడ ఇంట్లో అందెశ్రీ (64) కుప్పకూలగా.. ఆయన్ను హూటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీకి.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూ.కోటి పురస్కారం అందించింది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
తెలుగు భాష, సాహిత్యంపై అందెశ్రీకి ఉన్న ప్రేమతో పాటు, తన ప్రత్యేకమైన శైలి.. ఆయన్ను ప్రజాకవిగా నిలబెట్టింది.. గొర్రెల కాపరిగా మొదలైన ఆయన ప్రయాణం.. ఎన్నో పురస్కారాలతోపాట.. డాక్టరేట్ వరకు చేర్చింది.. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ.. వెనక్కి తగ్గకుంగా.. కవిత్వమే ఊపిరిగా గళాన్ని వినిపించారు. తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ కవిత్వం ఒక ప్రేరణగా నిలిచింది.. ఆయన రచించిన జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం పాట ఉద్యమానికి ఊపిరిగా నిలవడంతోపాటు.. తెలంగాణ అధికారిక గీతంగా గుర్తింపును పొందింది.
కాగా.. అందెశ్రీ రచించిన పాటలు ప్రజల్లో ఎంతో ఆదరణ పొందాయి.. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీతం ఆయనకు పేరు తెచ్చింది. పల్లెనీకు వందనములమ్మో, మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జన జాతరలో మన గీతం అనే గేయాలను అందెశ్రీ రచించారు.
అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట.. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం దక్కింది.. 2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం.. అలాగే.. లోక్ నాయక్ పురస్కారాన్ని అందెశ్రీ అందుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..