Urea Booking: రైతులకు అలర్ట్.. యాప్‌లో యూరియా బుక్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే బుకింగ్ క్యాన్సిల్

గత సీజన్‌లో యూరియా తగినంతగా అందుబాటులో లేక తెలంగాణ రైతులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. రైతులు క్యూలైన్లలో నిల్చోని అవస్థలు పడటం, యూరియా దొరక్కపోవడంతో ఆందోళనకు దిగిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు రాగా.. దానికి చెక్ పెట్టేందుకు యాప్ తీసుకొచ్చింది.

Urea Booking: రైతులకు అలర్ట్.. యాప్‌లో యూరియా బుక్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే బుకింగ్ క్యాన్సిల్
Urea Booking

Updated on: Dec 23, 2025 | 7:34 AM

రైతులు సులువుగా ఇంటి వద్ద నుంచే ఫోన్ ద్వారా యూరియా బుక్ చేసుకునేలా యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఫెర్టిలైజర్ బుకింగ్ పేరుతో యాప్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైతులు ఇన్‌స్టాల్ చేసుకుని యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ఈ యాప్ అందుబాటులోకి రాగా.. రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. యూరియా కోసం రైతులు క్యూలైన్‌లో నిల్చోవడం, దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో దానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యాప్ రూపొందించింది. దీని వల్ల యూరియా పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టవచ్చని, నిజమైన రైతులకే అందేలా చేయవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..? ఎలా బుక్ చేసుకోవాలి..? అనే విషయాలు చూద్దాం.

ఎలా బుక్ చేసుకోవాలంటే..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘Fertilizer Booking App’ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. దానిని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి
-ఆ తర్వాత ఫోన్ నెంబర్ టైప్ చేసి ఓటీపీని ఎంటర్ చేయండి
-మీ పట్టాదారు పాస్‌బుక్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ నెంబర్‌కు మరో ఓటీపీ వస్తుంది
-ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ భూమి వివరాలన్నీ కనిపిస్తాయి
-ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలను ఎంచుకోండి
-ఎన్ని బస్తాల యూరియా మీకు కావాలనేది నమోదు చేయండి
-అనంతరం ఏ సమీపంలోని ఏ డీలర్ దగ్గర యూరియా స్టాక్ ఉందనే వివరాలు కనిపిస్తాయి
-డీలర్‌ను సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే బుకింగ్ కోడ్ మెస్సేజ్ రూపంలో వస్తుంది
-ఆ మెస్సేజ్ చూపించి మీరు డీలర్ దగ్గర యూరియా తీసుకోవచ్చు

24 గంటల్లో తీసుకోకపోతే..

యూరియా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకున్నాక 24 గంటల్లో డీలర్ వద్ద తీసుకోవాలి. లేకపోతే మీ బుకింగ్ రద్దు అవుతుంది. ఆ తర్వాత మీరు 15 రోజుల వరకు యరియా బుక్ చేసుకోలేరు. పంటకు తగ్గట్లు యూరియా ఎంత అవసరమో అంత మాత్రమే పంపిణీ చేస్తారు. వరి పంటకు ఎకరానికి రెండున్నర బస్తాలు, చెరుకు, మొక్కజోన్న, మిరప లాంటి పంటలకు ఎకరానికి 5 బస్తాల మేర మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది.