రేపు రంజాన్ సందర్భంగా హైదరాబాద్ పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ లోని హాకీ గ్రౌండ్స్ లో ఈదుల్ ఫితర్ ప్రార్థనలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయి. మీర్ ఆలం ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేయనున్నందున ఈద్గా, తడ్బన్ వైపు వాహనాల రాకపోకలను అనుమతించరు. బదులుగా దీనిని బహదూర్ పురా చౌరస్తా వద్ద కిషన్ బాగ్, కామాటిపురా, పురానాపూల్ వైపు మళ్లిస్తారు. ఇక ఈద్గా వైపు వెళ్లే వాహనాలను శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట తదితర ప్రాంతాల వైపు మళ్లిస్తారు. కాలాపత్తర్ వద్ద మోచి కాలనీ, బహదూర్ పురా, షంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు మళ్లిస్తారు.
ఇక పురానాపూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను జియాగూడ వైపు మళ్లిస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి బహదూర్పురా వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద శంషాబాద్ లేదా రాజేంద్రనగర్ లేదా మైలార్ దేవపల్లి వైపు మళ్లిస్తారు. ఇక హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ జంక్షన్ ఫ్లైఓవర్ కింద రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ కింద వాహనాల రాకపోకలను అనుమతించరు.
ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మెహిదీపట్నం, లక్డీకాపూల్ వైపు నుంచి ఫ్లైఓవర్ పై మాత్రమే రాకపోకలు సాగించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నెం.12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను రోడ్ నంబర్ 1, 12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ హోటల్, ఆర్టీఏ ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా పంజాగుట్ట నుంచి తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఎర్రం మంజిల్ కాలనీ, ఆర్టీఏ ఖైరతాబాద్, నిరంకరి, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, మెహిదీపట్నం వైపు వాహనాలను మళ్లిస్తారు. రేపు హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ప్రారంభమవుతాయి. అయితే ఈద్ పండుగను కేరళతో పాటు లేహ్, కార్గిల్ లలో బుధవారం జరుపుకోనున్నారు.